ప్రజాస్వామ్యానికి గవర్నర్ పదవి పెనుభారం: మనీశ్ సిసోడియా

  • ఎన్డీయేతర ప్రభుత్వాల పనితీరును అడ్డుకోవడమే వారి పని అని ఆరోపణ
  • ప్రభుత్వం, గవర్నర్ల మధ్య వైరంతో బ్యూరోక్రాట్లు ఇబ్బంది పడుతున్నారని వ్యాఖ్య
  • గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్
గవర్నర్ పదవి ప్రజాస్వామ్యానికి పెనుభారమని... కాబట్టి దీనిని రద్దు చేయాలని ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా డిమాండ్ చేశారు. ఆయా రాష్ట్రాలలో ఎన్డీయేతర ప్రభుత్వాల పనితీరును అడ్డుకోవడమే గవర్నర్ల పని అని ఆరోపించారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు. పీటీఐ సంపాదకుల ముఖాముఖిలో ఆయన పాల్గొన్నారు.

లెఫ్టినెంట్ గవర్నర్, ప్రభుత్వం మధ్య గొడవల కారణంగా ఢిల్లీలోని బ్యూరోక్రాట్లు ఇబ్బంది పడుతున్నారన్నారు. వారి పట్ల ఆయన సానుభూతి వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రభుత్వం, ఎల్జీ మధ్య మాటల యుద్ధంతో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం హక్కులను కేంద్రం హరించివేస్తోందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తే అందరూ బాధపడతారన్నారు.

ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంతో ప్రమాణం చేయించేందుకు మనకు గవర్నర్ ఎందుకు? ఆ పదవిని తొలగించాల్సిందే అన్నారు. ఇతర సంస్థలు కూడా ప్రమాణం చేయించే కార్యక్రమాన్ని చేపట్టవచ్చునన్నారు. ప్రభుత్వాలను పడగొట్టడం మినహా వారు (గవర్నర్లు) చేసేదేమీ లేదని ఆరోపించారు.

ప్రభుత్వాలను పడగొట్టడం, ప్రభుత్వాలతో ప్రమాణం చేయించడం తప్పించి వారు ఏం చేస్తున్నారని నిలదీశారు. గవర్నర్ వ్యవస్థ దేశానికి భారంగా మారిందని అభిప్రాయపడ్డారు. ఎన్నికైన ప్రభుత్వం చేసే పనులను అడ్డుకోవడం తప్ప ఏం చేయడం లేదన్నారు. ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది ఆశిస్తున్నామని పేర్కొన్నారు.


More Telugu News