నీరజ్ చోప్రా గురించి పాక్ గోల్డ్ మెడలిస్ట్ అర్షద్ నదీమ్ తల్లి ఏమన్నారంటే...!

  • నీరజ్ చోప్రా మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నానన్న నదీమ్ తల్లి
  • నీరజ్ నా కొడుకులాంటి వాడే.. మరెన్నో పతకాలు సాధిస్తాడని వ్యాఖ్య
  • నీరజ్, నదీమ్‌లది సోదరబంధమన్న పాక్ గోల్డ్ మెడలిస్ట్ తల్లి
పారిస్ ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో స్వర్ణం గెలిచిన తన కొడుకు, భారత అథ్లెట్ నీరజ్ చోప్రా... ఇద్దరూ స్నేహితులని... స్నేహితులు మాత్రమే కాదు, అన్నదమ్ములని పాక్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ తల్లి అన్నారు. వారి మధ్య ఎలాంటి పోటీ లేదని, బలమైన స్నేహం ఉందన్నారు. నీరజ్ చోప్రా మున్ముందు ఇలాంటి విజయాలు సాధించాలని కోరుకుంటున్నానన్నారు. అతను కూడా తనకు కొడుకులాంటి వాడేనని... భవిష్యత్తులో మరెన్నో పతకాలు సాధిస్తాడని ఆశిస్తున్నానన్నారు. ఆటల్లో గెలుపోటములు సహజమేనని, వారిద్దరిది సోదరబంధమన్నారు.

తన కొడుకు స్వర్ణం సాధించడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఇది తమకు ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. గెలుపు కోసం అర్షద్ ఎంతో కష్టపడ్డారన్నారు. ఎట్టకేలకు పాకిస్థాన్ ప్రజలు అర్షద్‌ను చూసి చాలా గర్విస్తున్నారన్నారు. ఈ గెలుపుపై తల్లి కంటే ఎవరూ ఎక్కువ సంతోషపడలేరని, తన కొడుకు యావత్ పాకిస్థాన్‌ను ఆనందంలో ముంచెత్తాడన్నారు. నా కొడుకు స్వర్ణం సాధిస్తాడని ధీమాతో ఉన్నానని తెలిపారు.

పారిస్ ఒలింపిక్స్‌లో పాక్ అథ్లెట్ అర్షద్ నదీమ్ జావెలిన్ త్రోలో స్వర్ణం గెలుచుకోగా, భారత ఆటగాడు నీరజ్ చోప్రా కాంస్యం సాధించారు. భారత్, పాక్ అథ్లెట్స్ పతకాలు సాధించడంపై ఇటీవల నీరజ్ తల్లి సరోజ్ దేవి స్పందిస్తూ... నదీమ్ కూడా తన బిడ్డే అని పేర్కొన్నారు. మూడు రోజుల క్రితం పాక్ చేరుకున్న నదీమ్, సరోజ్ దేవి వ్యాఖ్యలపై స్పందించారు. తల్లి ఎవరికైనా తల్లేనని... ఆ తల్లి అందరి కోసం ప్రార్థించిందన్నారు. తనను కూడా బిడ్డ అన్నందుకు నీరజ్ తల్లికి కృతజ్ఞతలు అన్నారు. ఆమె తనకు కూడా అమ్మేనని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నీరజ్ చోప్రాపై నదీమ్ తల్లి స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది.


More Telugu News