భారత జట్టు బౌలింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ పేసర్!

  • మోర్నీ మోర్కెల్‌ నియామకం అయినట్టు వెలువడుతున్న కథనాలు
  • బీసీసీఐ సెక్రటరీ జై షా ఆమోదించారన్న ‘క్రిక్‌బజ్’
  • సెప్టెంబర్ 1 నుంచి పదవీకాలం ప్రారంభం కానుందని వెల్లడి
టీమిండియా కొత్త బౌలింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ పేసర్ మోర్నీ మోర్కెల్‌ నియామకం జరిగినట్టు ‘క్రిక్‌బజ్’ కథనం పేర్కొంది. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జై షా ధృవీకరించారని తెలిపింది. మోర్నీ మోర్కెల్ పదవీకాలం సెప్టెంబర్ 1న ప్రారంభమవనుందని పేర్కొంది. ఇప్పటికే ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌కు సహాయక కోచ్ లుగా అభిషేక్ నాయర్, టెన్ డష్కాటే నియామకం అయ్యారు. 

అయితే ఇటీవలే ముగిసిన శ్రీలంక టూర్‌లో తాత్కాలిక బౌలింగ్ కోచ్‌గా సాయిరాజ్ బహుతులే వ్యవహరించాడు. ఆ స్థానాన్ని మోర్నీ మోర్కెల్ భర్తీ చేయనున్నాడు. త్వరలోనే అతడు జట్టుతో కలవనున్నాడని 'క్రిక్‌బజ్' పేర్కొంది.
కాగా ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్, ఎస్ఏ20 లీగ్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్ జట్లకు బౌలింగ్ కోచ్‌గా మోర్నీ మోర్కెల్ వ్యవహరించాడు. అంతేకాదు పాకిస్థాన్ పురుషుల టీమ్‌కు కూడా పనిచేశాడు. ఇక కోచ్ గౌతమ్ గంభీర్‌తో కలిసి గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు మోర్నీ మోర్కెల్ ఆడాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు బౌలింగ్ కోచ్‌గా మోర్కెల్, మెంటార్‌గా గౌతమ్ గంభీర్ పనిచేశారు.

మోర్నీ మోర్కెల్ అంతర్జాతీయ కెరియర్ విషయానికి వస్తే దక్షిణాఫ్రికా తరపున 247 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 309, వన్డేల్లో 188, టీ20ల్లో 47 వికెట్లు సాధించాడు. దక్షిణాఫ్రికా అలనాటి బౌలింగ్ త్రయంలో డేల్ స్టెయిన్, వెర్నాన్ ఫిలాండర్‌లతో పాటు మోర్కెల్ కూడా ఉన్నాడు.


More Telugu News