రేవంత్‌లా అబద్దాలు చెబితే సీఎం అవుతాననుకుంటున్నారేమో?: భట్టివిక్రమార్కకు జగదీశ్ రెడ్డి చురక

  • ముఖ్యమంత్రిలా మాట్లాడితే భట్టివిక్రమార్కకు ఉన్న విలువ పోతుందని సూచన
  • భట్టివిక్రమార్క విజ్ఞతను కోల్పోయి మాట్లాడుతున్నారన్న జగదీశ్ రెడ్డి
  • హాస్టల్స్‌లో అపరిశుభ్రతకు బీఆర్ఎస్ కారణమని చెప్పడంపై ఆగ్రహం
రేవంత్ రెడ్డి ఉపయోగించే భాష మాట్లాడవద్దని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కకు ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి సూచించారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ... డిప్యూటీ సీఎం విజ్ఞతను కోల్పోయి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిలా మాట్లాడితే భట్టివిక్రమార్కకు ఉన్న గౌరవం పోతుందన్నారు. గురుకుల హాస్టళ్లలో విషాహారం తిని పిల్లలు చనిపోతుంటే... వందలాదిమంది ఆసుపత్రి పాలవుతుంటే ప్రభుత్వంలో చలనం లేదన్నారు. దీనికి కూడా కేసీఆర్, కేటీఆరే కారణమని అనడం విడ్డూరమన్నారు.

తొమ్మిది నెల‌ల కింద వండిన భోజ‌నాన్ని మీరు ఇప్పుడు పెడుతున్నారా? అని ప్ర‌శ్నించారు. భ‌ట్టి విక్ర‌మార్క కూడా విజ్ఞ‌త‌ను కోల్పోయి మాట్లాడుతున్నారన్నారు. రేవంత్ రెడ్డి భాష మాట్లాడితే, ఆయ‌నలా అబద్ధాలు మాట్లాడితేనే సీఎం అవుతాన‌ని భ‌ట్టి విక్ర‌మార్క‌ అనుకుంటున్నారేమోనని చురక అంటించారు. కానీ పాపం ఆయన ముఖ్యమంత్రి కాలేరని... పైగా ఉన్న గౌరవం పోతుందన్నారు. హాస్టల్స్‌లో అపరిశుభ్రతకు బీఆర్ఎస్ కారణమని చెబుతున్నారని... మీరు ముఖం కడుక్కోకుండా మరొకరు కారణమంటే ఎలా? అని ఎద్దేవా చేశారు.

సీతారామ ప్రాజెక్టుకు తామే అనుమతులు తెచ్చామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారని, కానీ ఆయన మాటలు విని జనం నవ్వుకుంటున్నారన్నారు. 2018 నుంచి మొదలు కేంద్రం సహా ఎన్నో సంస్థలతో మాట్లాడితే అనుమతులు వచ్చాయని వెల్లడించారు. అబద్ధాలు చెప్పవద్దని సూచించారు. అవసరమైతే అధికారుల వద్ద సమాచారం తీసుకోవాలన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీతారామ ప్రాజెక్టుపై కేంద్రానికి ఒక్క లేఖ అయినా రాశారా? అని ప్రశ్నించారు. అసలు నీటి పారుదల రంగంపై అధికారులతో సీఎం కనీసం రివ్యూ చేశారా? అని నిలదీశారు. కృష్ణానదిని అధికారులు కేఆర్ఎంబీకి అప్పగిస్తే... అసెంబ్లీలో కేసీఆర్ గర్జించారన్నారు. ఆ తర్వాతే కృష్ణానదిని కేఆర్ఎంబీకి అప్పగించడం లేదంటూ అసెంబ్లీలో తీర్మానం పెట్టారన్నారు.


More Telugu News