ఆర్మేనియాలో ఏపీ యువ‌కుడి మృతి.. స‌న్నిహితుల తీరుపై అనుమానాలు!

  • ఉద్యోగం కోసం ఆర్మేనియా వెళ్లిన తెలుగు యువ‌కుడు శివ‌నారాయ‌ణ 
  • మృతుడి స్వ‌స్థ‌లం ప్ర‌కాశం జిల్లా పెద్ద‌దోర్నాల మండ‌లంలోని హ‌సానాబాద్‌ 
  • మిత్రులు ఇచ్చిన పానీయం తాగి అస్వ‌స్థ‌తతో ఆసుప‌త్రిలో చేరి మృతిచెందిన వైనం
  • విభిన్న క‌థ‌నాల‌తో స‌న్నిహితుల తీరుపై అనుమానాలు
  • కుమారుడి మృత‌దేహాన్ని స్వ‌దేశానికి తెప్పించాల‌ని త‌ల్లిదండ్రుల వేడుకోలు
ఉద్యోగం కోసం ఆర్మేనియా వెళ్లిన ఆంధ్రా యువ‌కుడు అనుమానాస్ప‌ద రీతితో మృతిచెందాడు. మిత్రులు ఇచ్చిన పానీయం తాగి అస్వ‌స్థ‌తతో ఆసుప‌త్రిలో చేరిన అత‌డు శ‌నివారం చ‌నిపోయాడు. ఈ విష‌యాన్ని స‌న్నిహితులే మృతుడి త‌ల్లిదండ్రుల‌కు తెలియ‌జేశారు. అనంత‌రం రూ. 10 ల‌క్ష‌లు ఇస్తే స్వ‌దేశానికి మృత‌దేహాన్ని పంపిస్తామ‌ని చెప్ప‌డం, ఆ త‌ర్వాత వారి ఫోన్ స్విచ్చాఫ్‌ కావ‌డంతో స‌న్నిహితుల తీరుపై పేరెంట్స్ అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. 

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఏపీలోని ప్ర‌కాశం జిల్లా పెద్ద‌దోర్నాల మండ‌లంలోని హ‌సానాబాద్‌కు చెందిన చిన్న ఆవుల‌య్య కుమారుడు శివ‌నారాయ‌ణ (31) ఇంజ‌నీరింగ్ పూర్తిచేసి, ఆర్మేనియాలో ఉద్యోగం పొందాడు. ఈ క్ర‌మంలో 15 రోజుల క్రితం పేరెంట్స్‌కు తాను మ‌రో కంపెనీలో ఉద్యోగంలో చేరిన‌ట్లు స‌మాచారం ఇచ్చాడు. అక్క‌డే మ‌రో న‌లుగురు స్నేహితుల‌తో క‌లిసి రూమ్ తీసుకుని ఉంటున్న‌ట్లు తెలిపాడు. 

ఇక గురువారం మిత్రుల‌తో క‌లిసి పార్టీ చేసుకున్న స‌మ‌యంలో వారు ఇచ్చిన పానీయం తాగి అస్వ‌స్థ‌తతో ఆసుప‌త్రిలో చేరినట్లు శివ‌నారాయ‌ణ త‌ల్లిదండ్రుల‌కు శుక్ర‌వారం ఫోన్ చేసి చెప్పాడు. ఈ క్ర‌మంలో త‌ర్వాతి రోజు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న అత‌డి ఫొటోల‌ను పంపించారు స్నేహితులు. ఆ తర్వాత అదే రోజు శివ‌నారాయ‌ణ చనిపోయిన‌ట్లు స‌మాచారం ఇచ్చారు. 

అలాగే రూ.2ల‌క్ష‌లు ఇస్తే వీడియో కాల్ ద్వారా మృత‌దేహాన్ని చూపిస్తామ‌ని, రూ. 10ల‌క్ష‌లు పంపితే బాడీని స్వ‌దేశానికి పంపిస్తామ‌ని డిమాండ్ చేశార‌ట‌. ఆ త‌ర్వాత నుంచి వారి సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ కావ‌డంతో స‌హ‌చ‌రుల తీరుపై త‌ల్లిదండ్రులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కావ‌డం లేదంటూ శివ‌నారాయ‌ణ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు జోక్యం చేసుకుని త‌మ కుమారుడి మృత‌దేహాన్ని స్వ‌దేశానికి ర‌ప్పించాల‌ని కోరుతున్నారు.


More Telugu News