తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. రేపు మూడో విడత రుణమాఫీ

  • రూ. లక్షన్నర నుంచి రూ. 2 లక్షల వరకు రుణమాఫీ
  • స్వాతంత్ర్య వేడుకల అనంతరం వైరాకు ముఖ్యమంత్రి
  • సీతారామ ప్రాజెక్టు ప్రారంభం
  • అనంతరం జరిగే సభలో రుణమాఫీ ప్రారంభం
  • ఆ వెంటనే రైతుల ఖాతాల్లో నిధుల జమ
ఎన్నికల ప్రచారంలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మూడో విడత రుణమాఫీకి సిద్ధమైంది. ఇప్పటికే తొలి దఫాలో రూ. లక్ష, రెండో దఫాలో రూ. లక్షన్నర వరకు ఉన్న రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వం రేపు (15న) రూ. 2 లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేయబోతోంది. ఖమ్మం జిల్లా వైరాలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రుణమాఫీని ప్రారంభిస్తారు. ఆ వెంటనే రైతుల ఖాతాల్లో నిధులు జమ అవుతాయి.

హైదరాబాద్‌ గోల్కొండ కోటలో జరిగే స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి హెలికాప్టర్‌లో వైరా చేరుకుంటారు. అక్కడ ఇటీవల ట్రయల్ రన్ నిర్వహించిన సీతారామ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. అనంతరం జరిగే బహిరంగ సభలో రైతు రుణమాఫీని ప్రకటిస్తారు. 

ఈ విడతలో రూ. 1.5 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకు ఉన్న రైతుల రుణాలను మాఫీ చేస్తారు. జులై 18న మొదటి విడతలో భాగంగా రూ. లక్ష లోపు ఉన్న రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. అదే నెల 30న లక్షన్నర రూపాయల లోపు రుణాలను మాఫీ చేసింది. ఇలా 12 రోజుల వ్యవధిలోనే మొత్తం 17.55 లక్షల మంది రైతులకు రూ. 12 వేల కోట్లకుపైగా రుణాలు మాఫీ చేయడం తెలంగాణ చరిత్రలోనే ఇది మొదటిసారని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పుడు తుది విడతలో 14.45 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం తెలిపింది.


More Telugu News