ఉత్తర కొరియాకు వందలాది మేకలు అందించిన రష్యా... కారణం ఇదే!

  • ఇటీవల కాలంలో మరింత బలపడిన పుతిన్, కిమ్ మైత్రి
  • పలు అంశాల్లో ద్వైపాక్షిక సహకారానికి నిర్ణయం
  • ఉత్తర కొరియాలో చిన్నారులకు పాల ఉత్పత్తుల కొరత
  • రష్యా పంపించిన మేకలతో భారీగా మేకల సంతతి వృద్ధి చేయాలని యోచన 
నియంతృత్వ పోకడలతో పాలన సాగిస్తున్న దేశాల్లో రష్యా, ఉత్తర కొరియా ముందు వరుసలో ఉంటాయి. గత కొన్ని దశాబ్దాలుగా రష్యాలో వ్లాదిమిర్ పుతిన్ కు, ఉత్తర కొరియాలో కిమ్ జాంగ్ ఉన్ కు ఎదురులేదు. ఈ మధ్య కాలంలో ఈ రెండు దేశాల మధ్య మైత్రి మరింత పెరిగింది. రష్యా, ఉత్తర కొరియాలను పాశ్చాత్యదేశాలు ఎంతగా వ్యతిరేకిస్తుంటే... పుతిన్, కిమ్ మధ్య స్నేహం అంతగా బలపడుతోంది. 

వారి మైత్రికి గుర్తుగా రష్యా ప్రభుత్వం తాజాగా ఉత్తర కొరియాకు 432 మేకలు, 15 మేకపోతులను పంపించింది. గతేడాది పుతిన్-కిమ్ మధ్య శిఖరాగ్ర సమావేశం జరిగింది. పలు అంశాల్లో ద్వైపాక్షిక సహకారం అందించుకోవాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. 

ఉత్తర కొరియాలో చిన్నారులకు దీర్ఘకాలంగా పాల ఉత్పత్తుల కొరత నెలకొంది. ఇప్పుడు పంపిస్తున్న మేకల ద్వారా ఆ లోటును పూరించే అవకాశముంటుందని తెలుస్తోంది. పశ్చిమ తీర ప్రాంతంలోని రేవు పట్టణం నాంఫో శివార్లలో భారీ మేకల ఫార్మ్ లు నిర్మిస్తున్నారు. రష్యా పంపించిన మేకల ద్వారా ఈ ఫార్మ్ లలో మేకల సంతతిని భారీగా పెంచనున్నారు. తద్వారా మేక పాల కొరత తీరుతుందని ఉత్తర కొరియా ప్రభుత్వం భావిస్తోంది.


More Telugu News