రుణమాఫీ, రైతుబంధుపై కాంగ్రెస్ నేతలు చర్చకు సిద్ధమా?: ఈటల రాజేందర్

  • రైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చే వరకు వారి తరఫున బీజేపీ పోరాటం చేస్తుందన్న ఎంపీ
  • తెలంగాణలో 30 లక్షల మందికి రుణమాఫీ జరగలేదని విమర్శ
  • రైతులకు ప్రధానంగా నాలుగు హామీలు ఇచ్చారన్న ఈటల రాజేందర్
రుణమాఫీ, రైతుబంధుపై కాంగ్రెస్ నేతలు చర్చకు సిద్ధమా? అని బీజేపీ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ప్రశ్నించారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలయ్యేంత వరకు వారి తరఫున బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఎన్నో హామీలతో పాటు రైతులకు ఇచ్చిన హామీల విషయంలోనూ ప్రభుత్వం విఫలమైందన్నారు. తెలంగాణలో 30 లక్షల మందికి రైతు రుణమాఫీ జరగలేదన్నారు.

తాము అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని, కాబట్టి ఇప్పుడే వెళ్లి రుణాలు తీసుకోవాలని ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో చెప్పారని గుర్తు చేశారు. అలాగే రైతులతో పాటు కౌలు రైతులకు కూడా రైతుబంధు ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని, కానీ ఇప్పటి వరకు దానిని ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఏ హామీని నెరవేర్చడం లేదన్నారు.

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ రైతాంగానికి ప్రధానంగా నాలుగు హామీలు ఇచ్చిందని ఈటల వెల్లడించారు. అందులో మొదటిది రూ.2 లక్షల వరకు రుణమాఫీ, రెండోది... రైతులకు, కౌలు రైతులకు రైతుబంధు, మూడోది... అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్, నాలుగోది రైతు కూలీలకు నెలకు రూ.1000 చొప్పున 12 నెలలకు రూ.12 వేలు వేయాలని డిమాండ్ చేశారు. 

గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ మీద కోపంతోనే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు తప్ప... మిమ్మల్ని చూసి కాదని గుర్తించాలని కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఐదేళ్ల కోసం ప్రజలు మీకు అధికారం కట్టబెట్టారని, అందులో ఇప్పటికే 8 నెలలు పూర్తయిందన్నారు. కానీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ పాలన సాగించవద్దని హితవు పలికారు.


More Telugu News