యూపీలో అదృశ్యమైన స్వామీజీ ఏపీలో ప్రత్యక్షం.. అసలేమి జరిగిందంటే..!

  • శ్రీకాళహస్తికి మధుర శ్రీఉదాసిన్ కర్షిణి ఆశ్రమ పీఠాధిపతి శ్రీగురు శరానందజీ మహరాజ్
  • సమాచారం లేకుండా అదృశ్యం కావడంతో పోలీసులకు ఫిర్యాదు  
  • సాధారణ భక్తుడిలా శ్రీవారిని దర్శించుకున్న స్వామిజీ
  • చెన్నై మీదుగా యూపీకి పంపిన పోలీసులు
ఉత్తరప్రదేశ్ మథురలోని శ్రీఉదాసిన్ కర్షిణి ఆశ్రమ పీఠాధిపతి శ్రీగురు శరానందజీ మహారాజ్ ఏపీలోని శ్రీకాళహస్తిలో ప్రత్యక్షమయ్యారు. కొన్ని రోజుల క్రితం ఆయన తన ఆశ్రమం నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు. దీంతో ఆశ్రమ నిర్వహకులు ఆందోళనతో పోలీసులకు సమాచారం అందించారు. ప్రముఖ హిందూ సంస్థల్లో శ్రీ ఉదాసిన్ కర్షిణి ఆశ్రమం ఒకటి కావడం, దానికి వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉండటం, ప్రముఖులతో స్వామిజీకి సన్నిహిత సంబంధాలు ఉండండతో ఆయన ఆచూకీ కోసం దేశ వ్యాప్తంగా పోలీసు, నిఘా విభాగాలు దృష్టి సారించాయి.

రెండు రోజుల క్రితం ఆయన తిరుమల శ్రీవారిని సాధారణ భక్తుడిలా దర్శించుకున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. తిరుపతి జిల్లాలో ఆయన కదలికలు ఉన్నాయన్న సమాచారం అందడంతో పోలీస్ యంత్రాంగం రెండు రోజులుగా గాలింపు చేపట్టింది. ఈ క్రమంలో శ్రీకాళహస్తి పట్టణంలోని శుకబ్రహ్మాశ్రమంలో స్వామిజీ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. 

ఈ మేరకు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో మథుర నుంచి ఆశ్రమ ఉద్యోగులు, శిష్యులు సోమవారం శ్రీకాళహస్తికి చేరుకున్నారు. స్వామిజీ గది వద్దకు ఎవరినీ అనుమతించకపోవడంతో శ్రీకాళహస్తి డీఎస్పీ ఉమామహేశ్వరరెడ్డి, తిరుపతి స్పెషల్ బ్రాంచి సీఐ విశ్వనాథ్ చౌదరి, పట్టణ సీఐ గోపిలు శిష్య బృందం, స్థానిక శ్రీశుక బ్రహ్మశ్రమ పీఠాధిపతి శ్రీ విద్యాస్వరూపానందగిరి స్వామితో మాట్లాడారు.

అనంతరం పోలీసు అధికారులు మాట్లాడుతూ .. శ్రీగురు శరానందజీ మహారాజ్ ప్రశాంతత కోసం శ్రీకాళహస్తికి వచ్చారని, దానికి భంగం కలిగితే ఇక్కడ నుంచి వెళ్లిపోతామని చెప్పినట్టు తెలిపారు. తర్వాత స్వామిజీ శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్నారు. తదుపరి స్వామిజీని విమానాశ్రయానికి తరలించి అక్కడి నుంచి చెన్నై మీదుగా యూపీకి పంపారు. కాగా, శ్రీగురు శరానంద్ జీ మహారాజ్ తన ఆశ్రమానికి రావడంపై శ్రీవిద్యా స్వరూపానందగిరి స్వామి మాట్లాడుతూ తామిద్దరం వారణాసిలోని బెనారస్ యూనివర్సిటీలో విద్యనభ్యసించినట్టు తెలిపారు.


More Telugu News