భరతనాట్య ప్రదర్శనతో రికార్డులకెక్కిన చైనా బాలిక

  • బీజింగ్ లో అరంగేట్రం చేసిన 13 ఏళ్ల చిన్నారి
  • భారత రాయబార కార్యాలయం సిబ్బంది హాజరు
  • పొరుగు దేశంలో మన సంప్రదాయ నృత్యానికి పెరుగుతున్న ఆదరణ
పొరుగు దేశం చైనాలో మన సంప్రదాయ నృత్యానికి ఆదరణ పెరుగుతోంది. భరత నాట్యం నేర్చుకోవడానికి చైనా చిన్నారులు క్యూ కడుతున్నారు. తాజాగా బీజింగ్ లో చైనా బాలిక లియ్ ముజి (13) అరంగేట్రం ప్రదర్శన చేసింది. చైనాలో చైనా టీచర్ దగ్గర భరత నాట్యం నేర్చుకుని సోలోగా అరంగేట్రం చేసిన తొలి బాలికగా ముజి రికార్డు సృష్టించింది. చైనాలో భారత రాయబారి ప్రదీప్ రావత్ అర్ధాంగి శ్రుతి రావత్ చీఫ్ గెస్ట్ గా హాజరై బాలికను అభినందించారు. ఈ నెలాఖరులో ముజి చెన్నైలోనూ నాట్య ప్రదర్శన చేయనుందని బాలిక గురువు జిన్ షాన్ షాన్ చెప్పారు. గత పదేళ్లుగా ముజికి నాట్యం నేర్పిస్తున్నట్లు వివరించారు.

భరత నాట్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులు తొలిసారిగా గురువు, ఇతరుల ముందు ప్రదర్శన చేయడాన్ని అరంగేట్రంగా వ్యవహరిస్తారు. అరంగేట్రం పూర్తిచేసిన విద్యార్థి సొంతంగా ప్రదర్శనలు ఇవ్వడానికి, ఇతరులకు నాట్యం నేర్పడానికి గురువు అనుమతి లభిస్తుంది. లియ్ ముజి గురువు జిన్ షాన్ షాన్ భరత నాట్యంపై మక్కువతో చెన్నైకి వచ్చి నాట్యం నేర్చుకున్నారు. ఆపై 1999లో ఢిల్లీలో అరంగేట్రం చేశారు. ఆ తర్వాత చైనాకు వెళ్లి డ్యాన్స్ స్కూలు ఏర్పాటు చేసి చైనా చిన్నారులకు నాట్యం నేర్పిస్తున్నారు.


More Telugu News