ఇలాంటి సవతి సోదరులుంటారు... జాగ్రత్తమ్మా!: ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన 'మహా' సీఎం

  • మహారాష్ట్రలో మరి కొన్ని నెలల్లో ఎన్నికలు
  • మహిళలకు నెలకు.1500 ఇస్తామని హామీ ఇచ్చిన షిండే ప్రభుత్వం
  • దోపిడీదారులు ఇచ్చే లంచానికి ఆశపడొద్దన్న ఉద్ధవ్ థాకరే
  • ఘాటుగా బదులిచ్చిన సీఎం షిండే
మరికొన్ని నెలల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, అర్హులైన మహిళలకు ప్రతి నెల రూ.1,500 ఇస్తామని ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం హామీ ఇవ్వడం తెలిసిందే. ఈ పథకం పేరు ముఖ్యమంత్రి మఝీ లడ్కీ బహెన్ యోజన. ప్రియమైన చెలెళ్లకు ముఖ్యమంత్రి కానుక అనేది ఈ పథకం పేరులోని అర్థం. 

అయితే ఈ పథకంపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇది దోపిడిదారులు ఇచ్చే లంచం వంటిదని శివసేన యూబీటీ నేత ఉద్ధవ్ థాకరే విమర్శించారు. మహిళలు ఇలాంటి పథకాల వలలో చిక్కుకోవద్దని హితవు పలికారు. 

దీనిపై సీఎం ఏక్ నాథ్ షిండే  ఘాటుగా స్పందించారు. ఇలాంటి మోసకారులైన సవతి సోదరులుంటారు... జాగ్రత్తమ్మా అంటూ మహిళలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రూ.1,500 ఏమంత పెద్ద మొత్తం కాదని విపక్ష నేతలు అంటున్నారు... కానీ మహిళలకు ఆ రూ.1500 ఎంతో విలువైనవి అని షిండే స్పష్టం చేశారు. ప్రతి నెలా అందే ఆ డబ్బుతో మహిళలు ఇల్లు నడుపుకుంటారు అని వివరించారు. 

తనకు రక్తం పంచుకుపుట్టిన సోదరి ఒకరే ఉన్నారని, కానీ ఇప్పుడు రాష్ట్రంలోని కోట్లాది మంది తన సోదరీమణులేనని అన్నారు. ఇదేమీ ఎన్నికల కోసం ప్రకటించిన తాయిలం కాదని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళల అభ్యున్నతి కోసం పాటుపడుతూనే ఉన్నామని షిండే తెలిపారు.


More Telugu News