రేవంత్ రెడ్డి బృందం అమెరికా పర్యటనతో తెలంగాణకు రూ.31 వేల కోట్ల పెట్టుబడులు!

  • ఈ పెట్టుబడుల ద్వారా 30 వేల ఉద్యోగాలు వస్తాయని అంచనా
  • సంస్థల ఏర్పాటు, విస్తరణలపై అమెరికా దిగ్గజ కంపెనీల ప్రకటన
  • అమెరికా పర్యటన అనంతరం దక్షిణాఫ్రికాకు బయలుదేరిన తెలంగాణ బృందం
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వ బృందం అమెరికా పర్యటన ముగిసింది. పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో వారి పర్యటన సాగింది. వీరి పర్యటన నేపథ్యంలో రాష్ట్రానికి రూ.31,500 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశముంది. దీని ద్వారా 30,000 కొత్త ఉద్యోగాలు వస్తాయని అంచనా. అమెరికా పర్యటన అనంతరం ఈ బృందం సౌత్ కొరియాకు వెళుతోంది.

సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీనియర్ అధికారులతో కూడిన ప్రతినిధి బృందం న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, డల్లాస్, కాలిఫోర్నియాలలో 50కి పైగా కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ బృందం మూడు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, మూసీ పునరుజ్జీవనం తదితర ప్రాజెక్టులపై పలు కంపెనీల ప్రతినిధుల నుంచి హామీ వచ్చింది.

బిజినెస్, ఏఐ, సెమీ కండక్టర్స్ తదితర అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. హైదరాబాద్‌‍కు వచ్చి పెట్టుబడులు పెట్టాలని రేవంత్ రెడ్డి బృందం వివిధ సంస్థలను ఆహ్వానించింది. ఐటీ, జీసీసీ, లైఫ్ సైన్సెస్, ఫార్మా, డేటా సెంటర్, ఏఐ, క్లౌడ్ అండ్ డేటా సెంటర్స్, ఎలక్ట్రిక్ వెహికిల్, బ్యాటరీలు, గ్రీన్ ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు తెలంగాణకు రావడం లేదా విస్తరణకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థిక రంగ సంస్థలలో ఒకటైన చార్లెస్ స్క్వాబ్ జీసీసీ సహా పలు దిగ్గజ సంస్థలు ఐటీలో పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. గ్లోబల్ ఐటీ మేజర్ కాగ్నిజెంట్, ఆర్సీఎం విస్తరణపై ప్రకటనలు చేశాయి. ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగంలో దాదాపు డజను అమెరికన్ కంపెనీల నుంచి పెట్టుబడులు రానున్నాయి.


More Telugu News