అక్కడ అంత దారుణం జరుగుతుంటే... రాహుల్ గాంధీ చైనా ఆదేశాలనే పాటిస్తుంటాడు: బండి సంజయ్

  • బంగ్లాదేశ్ మారణహోమంపై రాహుల్ గాంధీ ఒక్క మాట మాట్లాడటం లేదని విమర్శ
  • మహనీయుల త్యాగాలను కాంగ్రెస్ తెరమరుగు చేసే ప్రయత్నం చేసిందని ఆరోపణ
  • నెహ్రూ అరాచకం, అనాలోచిత విధానం వల్ల ఆరోజు లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన
బంగ్లాదేశ్ పరిణామాలు, హింసపై లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడటం లేదని కేంద్రమంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ ప్రశ్నించారు. ఆయన ఎప్పుడూ శ్యాంపిట్రోడా భాషనే మాట్లాడుతారని, చైనా చెప్పినట్లు నడుచుకుంటారని విమర్శించారు. కరీంనగర్‌లో యువమోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ... జాతీయ పతాకాన్ని సగౌరవంగా ప్రతి ఇంటిపై ఎగరవేయాలని... తద్వారా భారత జాతి ఐక్యతను ప్రదర్శించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. మహనీయుల త్యాగాలను మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. నెహ్రూ కుటుంబానికి లాభం జరిగేలా... నెహ్రూ కుటుంబం భజన చేయడమే లక్ష్యంగా దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ నడిచిందన్నారు. మహనీయుల చరిత్రను తెరమరుగు చేసే ప్రయత్నం చేసిందని ఆరోపించారు.

కానీ మహనీయుల చరిత్ర తరతరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. వర్గాల పేరుతో, మతాల పేరుతో, ప్రాంతాల పేరుతో ఈ దేశాన్ని చీల్చింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. మైనార్టీ సంతుష్టీకరణ విధానాలతో దేశాన్ని చీల్చిందని మండిపడ్డారు. నెహ్రూ అరాచకం వల్ల... అనాలోచిత విధానం వల్ల ఆ రోజు లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోగా, కోట్లాది మంది నిరాశ్రయులయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేడ్కర్ స్ఫూర్తితో నరేంద్రమోదీ పాలన కొనసాగుతోందన్నారు. దానికి నిలువెత్తు నిదర్శనం 370 ఆర్టికల్ రద్దు అని వెల్లడించారు.


More Telugu News