మా ఊరికి రోడ్డు వేయండి.. పాక్ గోల్డ్ మెడ‌లిస్ట్ అర్ష‌ద్ న‌దీమ్ వేడుకోలు!

  • జావెలిన్‌ త్రోలో పాకిస్థాన్‌కు స్వ‌ర్ణ ప‌త‌కం అందించిన‌ అర్ష‌ద్ న‌దీమ్ 
  • స్వ‌దేశంలో ఘ‌న స్వాగతం.. హ‌ర్షం వ్య‌క్తం చేసిన గోల్డ్ మెడ‌లిస్ట్  
  • స్వ‌గ్రామానికి చేరుకున్న త‌ర్వాత ప్ర‌భుత్వానికి ప‌లు విన్న‌పాలు
పారిస్ ఒలింపిక్స్‌లో పురుషుల‌ జావెలిన్‌ త్రోలో పాకిస్థాన్‌కు చెందిన అర్ష‌ద్ న‌దీమ్ స్వ‌ర్ణ ప‌త‌కం గెలిచిన విష‌యం తెలిసిందే. దీంతో అర్షద్ నదీమ్ రూపంలో ప్రపంచ వేదికపై పాకిస్థాన్ విజయకేత‌నం ఎగురవేసింది. అతని విజయం ఆ దేశానికి ఎంతో గర్వకారణం. అందుకే స్వ‌దేశానికి తిరిగి వ‌చ్చిన న‌దీమ్‌కు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. దీనిప‌ట్ల ఆయ‌న హ‌ర్షం వ్య‌క్తం చేశారు. తాను గెలిచిన గోల్డ్‌తో దేశ‌వ్యాప్తంగా ఒక ర‌క‌మైన సంబరంతో కూడిన వాతావ‌ర‌ణం నెల‌కొంద‌ని పేర్కొన్నారు.   

ఇక స్వ‌గ్రామానికి చేరుకున్న త‌ర్వాత ఆయ‌న ప్ర‌భుత్వానికి ప‌లు విన్న‌పాలు చేశారు. నదీమ్ తన గ్రామానికి కావాల్సిన ప్రాథ‌మిక‌ అవసరాల కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. త‌మ ఊరికి రోడ్లు వేయాల‌ని, విద్యుత్ ఇవ్వాల‌ని కోరారు. అలాగే వంట గ్యాస్ కూడా అందించాల‌ని విన్న‌వించారు. 

వీటితో పాటు ద‌గ్గ‌ర‌లోని సిటీ మియాన్ చ‌న్నూలో ఓ యూనివ‌ర్సిటీ ఏర్పాటు చేస్తే త‌మ సోద‌రీమ‌ణులు ముల్తాన్ వ‌ర‌కు వెళ్ళవలసిన అవసరం లేకుండా, ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌ని చెప్పారు. ఇది త‌మ ఒక్క గ్రామానికి సంబంధించిన స‌మ‌స్య కాద‌ని, పాకిస్థాన్‌లో చాలా గ్రామీణ సమాజాలు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లని న‌దీమ్ పేర్కొన్నారు.    

కాగా, అర్షద్ జావెలిన్‌ను ఏకంగా 92.97 మీటర్ల దూరం విసిరి గోల్డ్ మెడ‌ల్‌ ద‌క్కించుకున్నాడు. అలాగే ఒలింపిక్ చ‌రిత్ర‌లో స‌రికొత్త రికార్డు కూడా నెల‌కొల్పాడు. ఇంత‌కుముందు ఉన్న ఒలింపిక్ రికార్డు 90.57 మీటర్లను నదీమ్ (92.97 మీ) అధిగ‌మించాడు.


More Telugu News