పాక్ పై జమ్మూకశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా కీలక వ్యాఖ్యలు

  • జమ్మూకశ్మీర్ లో శాంతిభద్రతల విఘాతానికి పాకిస్థాన్ కుట్ర చేస్తోందన్న ఎల్జీ మనోజ్ సిన్హా  
  • ఉగ్ర చర్యలను తిప్పికొట్టేందుకు వ్యూహరచన
  • భారీగా భద్రతా దళాలు, సీఆర్పీఎఫ్, పోలీసుల మోహరింపు చేసినట్లు వెల్లడి
జమ్మూకశ్మీర్ లో తాజాగా అనంత్ నాగ్ జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ సందర్భంగా ఇద్దరు సైనికులు మరణించారు. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా మాట్లాడుతూ, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు శిక్షణ పొందిన ఉగ్రవాదులను పాకిస్థాన్ పంపుతోందని ఆయన ఆరోపించారు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. పొరుగు దేశం దుర్మార్గపు కుట్రలను విఫలం చేసేందుకు భద్రతాదళాలు, పాలనా యంత్రాంగం ఒక వ్యూహాన్ని రూపొందించాయని అన్నారు. రాబోయే మూడు మాసాల్లో స్థానిక పరిస్థితిలో భారీ మార్పు కనిపిస్తుందని ఆయన అన్నారు.  
 
ఇటీవలి ఉగ్రఘటనలు బాధాకరమని పేర్కొన్న సిన్హా .. వాటిని కచ్చితంగా నియంత్రిస్తామని అన్నారు. పొరుగు దేశం ఉగ్రవాదానికి నిలయంగా మారిందని ఘాటు విమర్శలు చేశారు. జమ్మూకశ్మీర్ లో శాంతి భద్రతలను అస్థిరపరిచేందుకు విదేశీ ఉగ్రవాదులను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. అయితే ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు భారత్ కృషి చేస్తోందని చెప్పారు. పెద్ద ఎత్తున బలగాలను రంగంలోకి దించుతోందని, సైన్యం, సీఆర్పీఎఫ్, పోలీసు సిబ్బంది మోహరింపును ముమ్మరం చేసినట్లు తెలిపారు. ఉగ్ర ఘటనలను కట్టడి చేసే విధంగా భద్రతాబలగాలు ముందుకు సాగుతున్నాయని వెల్లడించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అందుకు సంబంధించిన వ్యూహాన్ని సమీక్షించారని రాబోయే రోజుల్లో సత్ఫలితాలు కనిపిస్తాయని సిన్హా పేర్కొన్నారు.


More Telugu News