సెబీ చీఫ్‌పై హిండెన్‌బర్గ్ ఆరోపణలు.. స్పందించిన రాహుల్ గాంధీ

  • హిండెన్‌బర్గ్ ఆరోపణలపై ఎక్స్ వేదికగా స్పందించిన రాహుల్ గాంధీ
  • సెబీ సమగ్రత దెబ్బతిందని ఆందోళన 
  • సెబీ చీఫ్ ఇంకా ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్న
  • జాయింట్ పార్లమెంటరీ కమిటీకి మోదీ ఎందుకు భయపడుతున్నారో స్పష్టమైందని వ్యాఖ్య
అదానీ గ్రూప్‌కు సంబంధించిన ఆఫ్‌షోర్ ఫండ్లలో సెబీ చైర్‌పర్సన్ మాధబి పురి బచ్, ఆమె భర్తకు వాటాలున్నాయంటూ అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపించడంపై లోక్‌సభలో ప్రతిపక్ష పార్టీ నేత రాహుల్ గాంధీ స్పందించారు. హిండెన్‌బర్గ్ ఆరోపణలపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. సెబీ సమగ్రత దారుణంగా దెబ్బతిందని కామెంట్ చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ఆరోపణల నిగ్గు తేల్చే దిశగా సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేసేందుకు మోదీ ఎందుకు భయపడుతున్నారో హిండెన్‌బర్గ్ నివేదిక తేటతెల్లం చేస్తోందని వ్యాఖ్యానించారు. 

‘‘చిన్న మదుపర్ల సంపదకు రక్షణగా నిలవాల్సిన సెబీ సమగ్రత దెబ్బతింది. సెబీ చీఫ్ ఇంకా తన పదవికి ఎందుకు రాజీనామా చేయలేదని మదుపర్లు ప్రశ్నిస్తున్నారు. వారు కష్టపడి సంపాదించుకున్న డబ్బు పోతే ఎవరు బాధ్యులు? సెబీ చైర్‌పర్సన్ ఎందుకు తన పదవికి రాజీనామా చేయట్లేదు? హిండెన్‌బర్గ్ తాజా ఆరోపణలు సంచలనంగా మారాయి. మరి సుప్రీం కోర్టు ఈ విషయాన్ని సుమోటోగా పరిశీలిస్తుందా? అసలు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసేందుకు ప్రధాని ఎందుకు జంకుతున్నారో ఈ ఆరోపణలతో స్పష్టమైంది. కమిటీ ఏయే అంశాలు వెలికి తీస్తుందో అన్న ఆందోళన కావచ్చు’’ అని రాహుల్ గాంధీ అన్నారు. 

కాగా, హిండెన్‌బర్గ్ ఆరోపణలను కుట్రగా బీజేపీ అభివర్ణించింది. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు దేశంలో ఆర్థిక అస్థిరత్వాన్ని సృష్టించేందుకు కుట్ర పన్నాయని మండిపడింది. సెబీ విశ్వసనీయత దెబ్బతీసేందుకు హిండెన్‌బర్గ్ ఈ ఆరోపణలు చేస్తోందని పేర్కొంది. ‘‘గతేడాది అదానీ గ్రూప్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన హిండెన్‌బర్గ్‌‌ విషయంలో భారత ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయి. ఇందులో కుట్రకోణం సుస్పష్టం. హిండెన్‌బర్గ్ ఆరోపణలను ప్రతిపక్ష పార్టీలు వల్లెవేస్తున్నాయి. దేశ ఆర్థిక రంగంలో అస్థిరత్వం, అరాచకం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి’’ అని బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశూ త్రివేదీ పేర్కొన్నారు.


More Telugu News