కుట్రపూరితం.. హిండెన్ బర్గ్ తాజా రిపోర్టుపై అదానీ గ్రూప్

  • ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించి లాభాలు ఆర్జించే కుట్ర
  • గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించిన కంపెనీ
  • సెబీ చైర్ పర్సన్ పై నిరాధార ఆరోపణలు చేస్తోందని ఫైర్
అమెరికాకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ కంపెనీ హిండెన్ బర్గ్ తాజా నివేదికపై అదానీ గ్రూప్ స్పందించింది. సెబీ చైర్ పర్సన్ పై చేసిన ఆరోపణలు నిరాధారమని తేల్చిచెప్పింది. తమ సంస్థతో సెబీ చైర్ పర్సన్ మాధవి పూరీ బచ్ కు ఆర్థిక సంబంధాలు ఉన్నట్లు నిరాధార ఆరోపణలు చేసిందంటూ హిండెన్ బర్గ్ సంస్థపై మండిపడింది. ఈమేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. హిండెన్ బర్గ్ నివేదిక మొత్తం కుట్రపూరితమని ఆరోపించింది. ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించడం ద్వారా హిండెన్ బర్గ్ లాభాలను ఆర్జించాలని కుట్ర చేసిందని, అందులో భాగంగానే మాధవి బచ్ పై ఆరోపణలు చేసిందని విమర్శించింది. గతంలో తమ గ్రూప్ పై చేసిన ఆరోపణలను ప్రస్తావిస్తూ.. హిండెన్ బర్గ్ ఆరోపణలు అసత్యమని దేశ అత్యున్నత న్యాయస్థానం తేల్చిన విషయాన్ని గుర్తుచేసింది.

హిండెన్‌బర్గ్ ఆరోపణలు ఇవే..
శనివారం సాయంత్రం విడుదల చేసిన నివేదికలో అదానీ గ్రూపునకు విదేశాల నుంచి నిధులను సమకూరుస్తున్న పలు డొల్ల కంపెనీల్లో సెబీ చైర్‌ పర్సన్ మాధవీ పూరీ బచ్, ఆమె భర్త ధావల్‌ బచ్‌లకు వాటాలు ఉన్నాయని వెల్లడించింది. బెర్ముడా, మారిషస్ దేశాలలో ఏర్పాటైన డొల్ల కంపెనీల నుంచి అదానీ గ్రూపుకు విదేశీ నిధులు సమకూరుతున్నాయని చెప్పింది. ఈ కంపెనీలలో మాధవి, ధావల్ బచ్ లకు వాటాలు ఉన్నాయని పేర్కొంది. ఈ డొల్ల కంపెనీలను గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ కంట్రోల్ చేస్తున్నారని ఆరోపించింది. ఈ వార్త స్టాక్ మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


More Telugu News