ఏపీ, తెలంగాణలకు రైల్వే మంత్రి గుడ్ న్యూస్

  • అసన్‌సోల్- వరంగల్ రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా ఏపీ, తెలంగాణలో కొత్త ట్రాక్స్
  • రూ.7,382 కోట్ల ప్రాజెక్టును కేబినెట్ ఆమోదించిందన్న మంత్రి అశ్వినీ వైష్ణవ్
  • ఏపీ, తెలంగాణలో మల్కన్‌గిరి-పాండురంగాపురం రైల్వే లైన్ నిర్మాణం
  • బొగ్గు గనుల రైల్వే లైన్స్‌ అనుసంధానమే లక్ష్యంగా ప్రాజెక్టు చేపట్టినట్టు వివరణ
  • ఏపీ, తెలంగాణకు అభివృద్ధికారకమని వెల్లడి
తెలుగు రాష్ట్రాలకు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ గుడ్ న్యూస్ చెప్పారు. పశ్చిమబెంగాల్‌లోని అసన్‌సోల్ నుంచి వరంగల్ మధ్య రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా మల్కన్‌గిరి-పాండురంగాపురం మధ్య కొత్త రైల్వే మార్గం నిర్మించనున్నట్టు వెల్లడించారు. అసన్‌సోల్ - వరంగల్ మార్గం 1,316 కిలోమీటర్ల పొడవుంటుందని పేర్కొన్నారు. ఈ కారిడార్‌లో భాగంగా జునాగఢ్ నుంచి నవరంగ్‌పుర్ వరకూ ఒకటి, మల్కన్‌గిరి నుంచి పాండురంగపురం వరకూ ఇంకొకటి చొప్పున రెండు మార్గాలకు శుక్రవారం కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసిందని వెల్లడించారు. ఈ మేరకు తన కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్మహించారు. 

ఈ ప్రాజెక్టులను డబుల్ లైన్లుగా నిర్మిస్తున్నామని, అంచనా వ్యయం రూ.7,382 కోట్లని మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఇందులో చాలా సొరంగ మార్గాలు ఉన్నాయని తెలిపారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లోని బొగ్గు గనుల నుంచి రైల్వే మార్గాలను అనుసంధానం చేయడమే ఈ ప్రాజెక్టుల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఇందులో భాగంగా తెలంగాణలో 19.77 కిలోమీటర్లు, ఏపీలో 85.5 కిలోమీటర్ల మేర ట్రాక్ నిర్మించనున్నట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టులతో తూర్పుగోదావరి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని అన్నారు. ఈ ప్రాజెక్టు కింద ఏపీలో వంతెన నిర్మాణం చేపడతామని చెప్పారు.  ప్రకృతి వైపరీత్యాల కారణంగా తూర్పు తీరంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడినప్పుడు ఈ ప్రాజెక్టులు ప్రత్యామ్నాయ రైల్వే మార్గాలుగా అక్కరకు వస్తాయన్నారు. వీటితో గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. త్వరలో ప్రాజెక్టు పనులు ప్రారంభించి ఐదేళ్లల్లో పూర్తి చేస్తామని వెల్లడించారు. ఇక విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు అంశంలో పురోగతి ఉందని కూడా మంత్రి పేర్కొన్నారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబుతో మాట్లాడానని, త్వరలో భూమి కేటాయింపులు ఉంటాయని చెప్పారు.


More Telugu News