జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్... ఇద్దరు జవాన్ల వీరమరణం

  • కార్డన్ అండ్ సెర్చ్‌ నిర్వహిస్తున్న బలగాలను ట్రాప్ చేసి కాల్పులకు పాల్పడ్డ ముష్కరులు
  • ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు సైనికులు
  • ఆపరేషన్ కొనసాగుతోందని అధికారుల ప్రకటన
జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఆర్మీ జవాన్లు వీరమరణం పొందారు. ఒకరు గాయపడ్డారు. అనంత్‌నాగ్ జిల్లా కోకెర్‌నాగ్‌లోని అహ్లాన్ అటవీ ప్రాంతంలో శనివారం మధ్యాహ్న సమయంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగిందని శ్రీనగర్‌లోని ‘చినార్ కార్ప్స్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ’ ఎక్స్ వేదికగా ప్రకటించింది.

ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం అందడంతో భద్రతా బలగాలు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయని, గాలింపు చేపడుతున్న బృందాన్ని ట్రాప్‌ చేసి ఉగ్రవాదులు కాల్పులు జరిపారని అధికారులు వివరించారు. ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారని భావిస్తున్నట్టు తెలిపారు. 

గాయపడ్డ ముగ్గురు సైనికులను సమీపంలోని హాస్పిటల్‌కు తరలించగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని, ఒకరు చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు సాధారణ పౌరులు కూడా గాయపడ్డారని, ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోందని వివరించారు.

కాగా గత కొన్ని నెలలుగా జమ్ము కాశ్మీర్‌లో ఉగ్రవాదుల ఉనికి పెరిగింది. దీంతో ముష్కర మూకలను తుదముట్టించడమే లక్ష్యంగా భద్రతా బలగాలు ఆపరేషన్లు కొనసాగిస్తున్నాయి.


More Telugu News