ఒలింపిక్ అథ్లెట్లపై ట్రోల్స్ ఆపండి... శిక్షణలో ఇవీ మా కష్టాలు!: అవినాశ్ తీవ్ర ఆగ్రహం

  • సోషల్ మీడియాలో ఆర్చర్ దిపికా కుమారి, రెజ్లర్ అంతిమ్ పంఘాల్‌పై ట్రోల్స్
  • ట్రోల్స్ వల్ల అథ్లెట్లు డిప్రెషన్‌లోకి వెళుతున్నారన్న అవినాశ్ సాబ్లే
  • మేమేదో ప్రభుత్వం సొమ్ము ఖర్చు చేస్తున్నామనుకుంటారని మండిపాటు
  • నెలల పాటు కుటుంబానికి దూరంగా ఉండాలన్న అవినాశ్
  • కఠిన శిక్షణ, అర్ధరాత్రి వచ్చికొని వండుకొని తినాల్సిన పరిస్థితి ఉంటుందని వెల్లడి
పారిస్ ఒలింపిక్స్ 2024లో పాల్గొన్న అథ్లెట్లను విమర్శించే లేదా సోషల్ మీడియాలో ట్రోల్ చేసే వారిపై 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ స్టార్ అవినాశ్ సాబ్లే ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆర్చర్ దీపికా కుమారి, రెజ్లర్ అంతిమ్ పంఘాల్ తదితరులపై నెట్టింట ట్రోల్స్ వస్తున్నాయి. ఇలా ట్రోల్ చేసే వారిపై అవినాశ్ అసహనం వ్యక్తం చేశాడు.

తమ అథ్లెట్లకు వ్యతిరేకంగా కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారని, అలాంటి కామెంట్స్ తనను బాధించాయని అవినాశ్ అన్నాడు. మన దేశంలో అగ్రశ్రేణి అథ్లెట్లు ఉన్నారని, వారు అద్బుతమైన ప్రదర్శన కనబరిచేవారేనని అన్నాడు. అయితే ట్రోల్స్ వల్ల వారు డిప్రెషన్‌లోకి వెళ్లడం కూడా తాను చూశానన్నాడు. క్రీడాకారులను అంతలా ఎగతాళి చేస్తుంటే వారు దేశానికి ఎలా ప్రాతినిథ్యం వహించగలరని మండిపడ్డాడు. పారిస్ ఒలింపిక్స్-2024లో జరిగిన 3,000 మీటర్ల స్టీపుల్‌చేజ్ ఫైనల్‌లో అవినాశ్ సాబ్లే 11వ స్థానంలో నిలిచాడు.

దీపికా కుమారి, అంతిమ్ పంఘల్ తదితరులపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. దీపికకు ఇది నాలుగో ఒలింపిక్స్. మహిళల ఇండివిడ్యువల్ ఆర్చరీ క్వార్టర్ ఫైనల్లో ఆమె పరాజయం పాలైంది. మరోవైపు, పంఘల్ ప్రీ క్వార్టర్స్ రౌండ్ లో 10-0తో ఓడిపోయింది. విదేశాల్లో అథ్లెట్స్ కఠిన శిక్షణ తీసుకుంటారని సాబ్లే తెలిపాడు.

తామేదో ప్రభుత్వం సొమ్మును ఖర్చు చేస్తూ ఆనందంగా గడుపుతున్నామని, టూర్‌కు వెళ్లినట్లుగా ఉంటుందని కొంతమంది అనుకుంటారని, కానీ అదంతా అవాస్తవం అన్నాడు. శిక్షణ కోసం నాలుగైదు నెలలు కుటుంబానికి, స్నేహితులకు దూరంగా ఉండవలసి వస్తుందన్నాడు. మైదానంలో శిక్షణ పూర్తయ్యాక అర్ధరాత్రి వచ్చి వండుకొని తినాల్సిన పరిస్థితి ఉంటుందన్నాడు. ఒలింపిక్స్‌లో అథ్లెట్లు సత్తా చాటడం లేదని కొంతమంది భావిస్తారని, కానీ ప్రపంచ అత్యుత్తమ క్రీడాకారులతో మనం పోటీ పడుతున్న విషయాన్ని గుర్తించాలన్నాడు.


More Telugu News