కాలిఫోర్నియాలోని గూగుల్ ప్రధాన కార్యాలయానికి రేవంత్ రెడ్డి బృందం

  • గూగుల్ ప్రతినిధులతో రేవంత్ రెడ్డి బృందం చర్చలు
  • నిన్న సెమీకండక్టర్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న సీఎం
  • తెలంగాణను 'ఫ్యూచర్ స్టేట్' పిలుద్దామని పిలుపు
అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన బృందంలోని సభ్యులు కాలిఫోర్నియాలోని గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. తెలంగాణకు పెట్టుబడులు లక్ష్యంగా రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ఐటీ పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు అగ్రరాజ్యంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా నిన్న గూగుల్ ప్రధాన కార్యాలయానికి వెళ్లి ఆ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపారు.

సెమీ కండక్టర్ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం

హైదరాబాద్ నగర స్వరూప స్వభావాలను మార్చబోయే ఏఐ సిటీ, స్కిల్ యూనివర్సిటీ, నెట్ జీరో సిటీ లాంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్రం 'ది ఫ్యూచర్ స్టేట్'కు పర్యాయపదంగా మారుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఇండియన్ కాన్సులేట్ జనరల్, యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ ఫోరమ్ సంయుక్తంగా నిన్న ఏర్పాటు చేసిన సెమీ కండక్టర్ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడారు.

తెలంగాణలో చేపడుతున్న కొత్త ప్రాజెక్టులను వివరించారు.మీ భవిష్యత్తును ఆవిష్కరించుకోండి... అందరం కలిసికట్టుగా సరికొత్త భవిష్యత్తును తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు. ఇప్పటివరకు తాము న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, టెక్సాస్‌లో పర్యటించామన్నారు. ఇప్పుడు కాలిఫోర్నియాలో ఉన్నామన్నారు. అమెరికాలో ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉందన్నారు.

ఔటాఫ్ మెనీ.. వన్ అనేది న్యూయార్క్ స్టేట్ నినాదమని, టెక్సాస్‌ను లోన్ స్టార్ స్టేట్ అని పిలుస్తారని, అలాగే కాలిఫోర్నియాకు యురేకా అనే నినాదం ఉందని గుర్తు చేశారు. భారత్‌లో రాష్టాలకు ఇలాంటి ప్రత్యేక నినాదాలేమీ లేవన్నారు. ఇక నుంచి తెలంగాణ రాష్ట్రానికి అలాంటి ఒక లక్ష్య నినాదాన్ని ట్యాగ్ లైన్‌గా పెట్టుకుందామన్నారు. ఇకపై తెలంగాణ రాష్ట్రానికి ఒక లక్ష్యాన్ని నిర్ధేశిస్తున్నామని... తెలంగాణను 'ఫ్యూచర్ స్టేట్'గా పిలుద్దామని ప్రకటించారు. 

ఈ లక్ష్య సాధనలో అందరూ భాగస్వాములు కావాలని... అందుకే అందరినీ తెలంగాణకు ఆహ్వానిస్తున్నామన్నారు. ప్రపంచ టెక్ పరిశ్రమలకు తెలంగాణలో అనుకూలమైన వాతావరణం ఉందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పెట్టుబడులకు అనుకూలమైన విధానాలను తమ ప్రభుత్వం అనుసరిస్తుందన్నారు.


More Telugu News