యూట్యూబ్‌ మాజీ సీఈవో మృతి.. దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసిన‌ సుందర్‌ పిచాయ్

  • యూట్యూబ్‌ మాజీ సీఈఓ సుసాన్‌ వోజ్‌కికీ కన్నుమూత‌
  • రెండేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడిన సుసాన్‌
  • ఆమె లేని ప్రపంచాన్ని ఊహించడం కష్టమన్న సుందర్‌ పిచాయ్‌
యూట్యూబ్‌ మాజీ సీఈఓ సుసాన్‌ వోజ్‌కికీ కన్నుమూశారు. ఆమె రెండేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడి చ‌నిపోయిన‌ట్లు ఆల్ఫాబెట్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ శనివారం తెలిపారు.

అమెరికాకు చెందిన సుసాన్ 2023 వరకు యూట్యూబ్‌ సీఈఓగా పనిచేశారు. అంతకుముందు ఆమె గూగుల్‌లో పనిచేశారు. ఈ నేపథ్యంలో సుసాన్‌ మృతిపై గూగుల్ బాస్ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

రెండు సంవత్సరాలు క్యాన్సర్‌తో పోరాడిన తన స్నేహితురాలు మరణించడం నమ్మశక్యంగా లేదని పేర్కొన్నారు. తను ఓ అద్భుతమైన వ్యక్తి, నాయకురాలు అని, ఆమె లేని ప్రపంచాన్ని ఊహించడం కష్టమన్నారు. ఆమె గూగుల్‌ ప్ర‌పంచంపై ఎంతో ప్ర‌భావం చూపార‌ని, ఆమెను కోల్పోవ‌డం తీర‌నిలోటు అని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె కుంటుంబ స‌భ్యుల‌కు సుంద‌ర్ పిచాయ్ ప్ర‌గాఢ‌సానుభూతి తెలిపారు.    

కాగా, గూగుల్‌లో సుసాన్‌ కీలకంగా వ్యవహరించారు. యూట్యూబ్ సీఈఓగా ఆమె పదవీకాలంలో ఈ ప్లాట్‌ఫారమ్‌ను గ్లోబల్ పవర్‌హౌస్‌గా తీర్చిదిద్దారు. ఇది మిలియన్ల కొద్దీ కంటెంట్ సృష్టికర్తలు, బిలియన్ల మంది వీక్షకులపై ప్రభావం చూపింది.

గూగుల్ యాజమాన్యంలోని కంపెనీల‌లో 25 ఏళ్లు ప‌నిచేశారు. ఫిబ్రవరి 2023లో ఆమె సీఈఓగా వైదొలుగుతున్నట్లు ప్రకటించ‌డంతో భారతీయ-అమెరికన్ నీల్ మోహన్ యూట్యూబ్ కొత్త సీఈఓగా నియమితులయ్యారు.


More Telugu News