జగన్ కి ఏ రంగు చూసినా ఎరుపు రంగుగానే కనిపిస్తోంది: ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు

  •  కక్షలు, కేసులు, వేధింపులు, హత్యలకు మారుపేరు ‘జగన్ రెడ్డి’ అని విమర్శించిన మంత్రి
  • రెంటు కుటుంబాల మధ్య ఘర్షణను ప్రభుత్వానికి ఆపాదించే కుట్ర జగన్ చేస్తున్నారని మండిపాటు
  • ఎక్కడ ఎరుపు రంగు కనిపించినా సరే జగన్ రెడ్డికి రెడ్ బుక్ కనిపిస్తోందంటూ ఎద్దేవా
మాజీ సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ నేత, ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శలు గుప్పించారు. కక్షలు, కేసులు, వేధింపులు, హత్యలకు మారుపేరు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అని దుయ్యబట్టారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ .. హింస, హత్యల గురించి జగన్ రెడ్డి మాట్లాడుతుంటే రావణాసురుడు రామాయణం చెప్తున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. గత ఐదేళ్ల కాలం ప్రజా పాలన కంటికి కనిపించలేదని విమర్శించారు. జగన్ రెడ్డి పాలన అనేకంటే 144 సెక్షన్ పాలన అని చెప్పుకుంటే బాగుంటుందని అన్నారు. ప్రజాతీర్పును ఓర్వలేక వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తప్పుడు రాతలతో, తప్పుడు ప్రచారంతో ప్రజలను మరొకసారి ప్రజలను మభ్యపెట్టేందుకు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు.

నంద్యాల జిల్లా సీతారామపురం గ్రామానికి చెందిన దళితులకు చెందిన ఎకరం 40 సెంట్ల భూమిని వైసీపీ నాయకుడు నారపరెడ్డి లీజుకు తీసుకుని, లీజు సమయం పూర్తయినా కూడా డబ్బులు ఇవ్వలేదని రామానాయుడు అన్నారు. పైగా వారిపై బెదిరింపులకు పాల్పడ్డారని అన్నారు. భూమిని దళితులకు ఇవ్వాలని గ్రామ పెద్ద చెప్పిన పాపానికి నారపరెడ్డి, తన అనుచరులతో కలిసి ఆగస్టు 3న శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులపై, వారి సోదరుల ఇంటిపై చేసిన దాడులు రికార్డులలో ఉన్నాయని అన్నారు. కుటుంబ కలహాల మధ్య జరిగిన తగదాల వల్ల సుబ్బారాయుడు మరణిస్తే దానికి కూడా రాజకీయ రంగు పులిమి టీడీపీకి అంటగట్టే విషప్రయత్నం జగన్ మోహన్ రెడ్డి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వినుకొండ హత్యను సైతం టీడీపీ హత్యగానే ప్రచారం చేసి విఫలమైందని, అందువల్లే నంద్యాలలో ఈ డ్రామాకు తెరలేపారని మంత్రి అన్నారు. జగన్ తన ఉనికిని కాపాడుకునేందుకే ఇలాంటి విషప్రచారం చేస్తున్నారని, జగన్ రెడ్డి శవ రాజకీయాలు చేయడంలో నేర్పరి అని అన్నారు. జగన్ రెడ్డి పదేపదే రెడ్ బుక్‌ను కలవరిస్తున్నారని అన్నారు.  జగన్ రెడ్డి పాలనలో జరిగిన అవినీతి ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో ఏ రంగు చూసినా ఎరుపు రంగుగానే కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. సూపర్ సిక్స్ పథకాల అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, చంద్రబాబు అనుభవం, పవన్ కల్యాణ్, మోదీ సహకారంతో రాష్ట్రం అభివృద్ధి  చెందుతుందని మంత్రి రామానాయుడు దీమా వ్యక్తం చేశారు.


More Telugu News