10 గంటల్లో 4.6 కేజీల బరువు తగ్గిన కాంస్య పతక విజేత అమన్ సెహ్రావత్.. ఎలా సాధ్యమైంది?

  • కాంస్య పోరుకు ముందు 4.6 కేజీలు ఎక్కువ బరువున్న రెజ్లర్
  • ‘అమన్ మిషన్’ను విజయవంతం చేసిన కోచింగ్ సిబ్బంది
  • 10 గంటల్లో నిర్విరామంగా వేర్వేరు సెషన్ల నిర్వహణ
పారిస్ ఒలింపిక్స్‌లో 21 ఏళ్ల రెజ్లర్ అమన్ సెహ్రావత్ కాంస్యం రూపంలో భారత్‌కు మరో పతకాన్ని అందించిన విషయం తెలిసిందే. అయితే సెమీ ఫైనల్‌లో ఓడిపోయి.. 57 కేజీల విభాగంలో కాంస్యం కోసం ఆడాల్సిన మ్యాచ్‌కు ముందు అమన్ అదనంగా 4.6 కేజీలు పెరిగి 61.5 కేజీలు బరువు తూగాడు. దీంతో భారత శిబిరంలో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. అప్పటికే వినేశ్ ఫోగట్‌కు ఎదురైన పరిస్థితిని కళ్లారా చూసిన కోచింగ్ సిబ్బంది టెన్షన్‌కు గురయ్యారు. అయితే మ్యాచ్ సమయానికల్లా అమన్‌ బరువును తగ్గించేందుకే కోచ్‌లు మిషన్‌ను ప్రారంభించారు. సీనియర్ రెజ్లింగ్ కోచ్‌లు జగ్మందర్ సింగ్, వీరేందర్ దహియాతో పాటు ఆరుగురు కోచింగ్ సిబ్బంది ఈ మిషన్‌లో పనిచేశారు.

అమన్ సాయంత్రం 6:30 గంటల సమయంలో సెమీఫైనల్‌ మ్యాచ్‌లో జపాన్‌ క్రీడాకారుడు హిగుచి చేతిలో ఓడిపోయాడు. ఆ తర్వాత వెంటనే బరువును చెక్ చేయగా 4.6 కేజీలు అదనంగా ఉంది. దీంతో ఏమాత్రం సమయం వృథా కాకుండా కోచింగ్ సిబ్బంది తమ పని మొదలుపెట్టారు.

ఏకంగా ఒకటిన్నర గంటల సమయం పాటు మ్యాట్ సెషన్‌ నిర్వహించారు. ఈ సమయంలో ఇద్దరు సీనియర్ కోచ్‌లు అమన్‌ను స్టాండింగ్ రెజ్లింగ్‌ ఆడించారు. ఆ తర్వాత ఒక గంటపాటు హాట్-బాత్ సెషన్ నిర్వహించారు. ఆ వెంటనే అంటే 12.30 గంటలకు జిమ్‌కు తీసుకెళ్లారు. ట్రెడ్‌మిల్‌పై నాన్‌స్టాప్‌గా ఒక గంటపాటు అమన్ పరిగెత్తాడు. బాగా చెమటలు పట్టడంతో డీహైడ్రేట్ అయ్యాడు. ఈ ప్రక్రియలు అమన్ బరువు తగ్గేందుకు సాయపడ్డాయి. ఆ తర్వాత 30 నిమిషాలపాటు అమన్‌కు విరామం ఇచ్చారు. ఆ 5 నిమిషాల ఆవిరి స్నానం సెషన్లను ఐదుసార్లు నిర్వహించారు.

చివరి సెషన్ ముగిసే సమయానికి అమన్ ఇంకా 900 గ్రాముల ఎక్కువ బరువు ఉన్నాడు. దీంతో అతడికి మసాజ్ చేయించారు. ఆ తర్వాత లైట్ జాగింగ్ చేయమని కోచ్‌లు కోరారు. ఆ తర్వాత  ఐదు సార్లు 15 నిమిషాల చొప్పున రన్నింగ్ సెషన్‌లు నిర్వహించారు. మొత్తానికి ఉదయం 4:30 గంటలకు అమన్ బరువు 56.9 కిలోలకు దిగివచ్చింది. అర్హత బరువు కంటే మరో 100 గ్రాములు తక్కువగానే ఉన్నాడు. కోచ్‌లతో పాటు రెజ్లర్ల బృందం అంతా ఊపిరి పీల్చుకుంది. 

కాగా ఈ సెషన్‌ల మధ్య అమన్‌కి నిమ్మకాయ రసం, తేనె కలిపిన గోరువెచ్చని నీరు, కొంచెం కాఫీ మాత్రమే అందించారు. ఇంకో విషయం ఏంటంటే.. అమన్ రాత్రంతా కంటి మీద కునుకు వేయలేదు. రాత్రంతా మెలకువగానే ఉన్నాడు. విరామ సమయాల్లో రెజ్లర్ల వీడియోలు చూస్తూ గడిపాడు. కాగా కాంస్య పతక పోరులో ప్యూర్టోరికో రెజ్లర్ దరియన్ టోయ్‌ను అమన్13-5తో ఓడించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.

కాగా 50 కేజీల మహిళల కేటగిరిలో 100 గ్రాములు అధిక బరువు కారణంగా వినేశ్ ఫోగట్ ఫైనల్ ఆడే అవకాశం కోల్పోయిన విషయం తెలిసిందే. రజత పతకం ఇవ్వాలంటూ అభ్యర్థిస్తూ ఆమె న్యాయ పోరాటం చేస్తోంది. ఈ మేరకు ఒలింపిక్‌ సంఘం వద్ద అప్పీల్ కూడా చేసుకుంది.


More Telugu News