17 నెలల నిర్బంధం తర్వాత ఇంట్లో టీ ఆస్వాదించిన మనీశ్ సిసోడియా

  • ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన సిసోడియా
  • సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేయడంతో నిన్న జైలు నుంచి విడుదల
  • భార్యతో కలిసి టీ తాగుతున్న ఫొటోను షేర్ చేసిన ఆప్ నేత
‘17 నెలల తర్వాత లభించిన స్వేచ్ఛలో తొలి ఉదయం ఇంట్లో టీ తాగుతున్నా’.. అంటూ ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఈ ఉదయం ‘ఎక్స్’లో ఫొటో షేర్ చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన ఆయన 17 నెలలపాటు తీహార్ జైలులో ఉన్నారు. బెయిలుపై నిన్న సాయంత్రం జైలు నుంచి విడుదలైన ఆయన.. భార్యతో టీ తాగుతున్న ఫొటోను పంచుకున్నారు. 

‘భారతీయులందరికీ స్వేచ్ఛగా జీవించే హక్కు రాజ్యాంగం కల్పించింది. అందరితోపాటు కలిసి ఊపిరి పీల్చుకునే స్వేచ్ఛ భగవంతుడు మనకు ప్రసాదించాడు’ అని రాసుకొచ్చారు. మద్యం పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిసోడియాకు నిన్న సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. అయితే, ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాత్రం ఇంకా అదే జైలులో ఉన్నారు. 

బెయిలు నుంచి విడుదలైన వెంటనే అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను కలిశారు. సిసోడియాను చూడగానే కేజ్రీవాల్ భార్య సునీత కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. కేజ్రీవాల్ తల్లిదండ్రుల ఆశీర్వాదాలు సిసోడియా తీసుకున్నారు. తనకు బెయిలు రావడంపై సిసోడియా స్పందిస్తూ.. బాబా సాహెబ్ అంబేద్కర్‌కు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు.


More Telugu News