జయా బచ్చన్ పై రాజ్యసభ చైర్మన్ ఫైర్.. ఎందుకంటే...!

  • రాజ్య‌స‌భ‌లో చైర్మ‌న్ జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్, ఎంపీ జ‌యా బ‌చ్చ‌న్ మ‌ధ్య వాగ్వాదం
  • తాను ఒక ఆర్టిస్టును అని, శ‌రీర భాష‌ను అర్థం చేసుకోగ‌ల‌నన్న జ‌యా
  • మీ స్వ‌రం ఆమోద‌యోగ్యంగా లేదంటూ చైర్మన్‌ను త‌ప్పుప‌ట్టిన వైనం
  • దాంతో ఆమెపై ఒక్క‌సారిగా ఫైర్ అయిన జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్
  • మీరు ఎవ‌రైనా కావొచ్చు.. కానీ స‌భా మ‌ర్యాద పాటించాలని సూచ‌న‌
రాజ్య‌స‌భ చైర్మన్ జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్‌, స‌మాజ్ వాది పార్టీ ఎంపీ జ‌యా బ‌చ్చ‌న్ మ‌ధ్య మ‌రోసారి తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. జ‌యా అమితాబ్ బచ్చ‌న్ మాట్లాడాల‌ని కోరుతూ ధ‌న్‌క‌ర్ పిలిచారు. ఆ స‌మ‌యంలో లేచిన జ‌యా.. త‌న‌ను జయా అమితాబ్ బ‌చ్చ‌న్ అని పిలవడంలో ఏదో తేడా కనిపిస్తోందన్నారు. తాను ఒక ఆర్టిస్టును అని, శ‌రీర భాష‌ను అర్థం చేసుకోగ‌ల‌నని, మీరు పిలిచిన విధానం, మీ స్వ‌రం ఆమోద‌యోగ్యంగా లేదని చైర్మన్‌ను త‌ప్పుప‌ట్టారు. తనను జయా బచ్చన్ అని పిలిస్తే బాగుండేదని అన్నారు.

దీంతో చైర్మన్ జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్ ఆమెపై ఒక్క‌సారిగా ఫైర్‌ అయ్యారు. "ఇక చాలు... మీరు ఎవ‌రైనా కావొచ్చు. కానీ స‌భా మ‌ర్యాద పాటించాలి. డైరెక్ట‌ర్ ఆధీనంలోనే న‌టులు ఉంటారు. మీరు సెల‌బ్రిటీవే కావొచ్చు. మీకే గుర్తింపు ఉంద‌న్న‌ భావ‌న‌లోనే ఉండ‌కండి" అంటూ చుర‌క‌లంటించారు. తాము కూడా తగిన గుర్తింపుతోనే ఈ స్థాయికి వ‌చ్చామ‌ని చైర్మ‌న్‌ ధ‌న్‌క‌ర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తోటి పార్లమెంటేరియన్ల పట్ల తనకు గౌరవం ఉందని, అయితే ఈ గౌరవాన్ని ఎవరూ దుర్వినియోగం చేయరాదని, చైర్మన్ స్థానంలో ఉన్న వ్యక్తిపై ఆరోపణలు చేయడానికి లైసెన్స్ ఇచ్చినట్టు కాదని ధన్‌క‌ర్ అన్నారు. ఇలా ఎగువసభలో వాగ్వాదం జరగడంతో ప్రతిపక్ష సభ్యులు వాకౌట్‌ చేశారు.

అనంత‌రం పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో జ‌యా బ‌చ్చ‌న్‌ మీడియాతో మాట్లాడారు. చైర్మన్ మాట్లాడిన తీరు త‌న‌ను అవ‌మాన‌క‌రంగా ఉంద‌న్నారు. పార్ల‌మెంట్‌లో అంద‌రు మాట్లాడుతున్న తీరు, గ‌తంలో ఎప్పుడూ ఇలా జ‌ర‌గ‌లేద‌న్నారు. చైర్మన్ ధ‌న్‌క‌ర్ త‌న‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని జ‌యా డిమాండ్ చేశారు. 

అలాగే ప్రతిపక్ష నేత మాట్లాడేందుకు లేచి నిలబడితే మైక్‌ ఆఫ్‌ అయిందని ఆమె ఆరోపించారు. ప్ర‌స్తుతం  జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్‌, జ‌యా బ‌చ్చ‌న్ మ‌ధ్య రాజ్య‌స‌భ‌లో జ‌రిగిన ఈ వాగ్వాదం తాలూకు వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.


More Telugu News