'గుడ్ మార్నింగ్' బ‌దులు 'జైహింద్‌'... హ‌ర్యానా స‌ర్కార్‌ కీల‌క నిర్ణ‌యం

  • ఆగ‌స్టు 15 నుంచి అన్ని పాఠ‌శాల‌ల్లో గుడ్ మార్నింగ్ బ‌దులుగా జైహింద్ గ్రీటింగ్
  • విద్యార్థులు, టీచ‌ర్లంద‌రూ ఇలాగే చెప్పేలా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు 
  • విద్యార్థుల్లో దేశ‌భ‌క్తి, ఐక్య‌త‌ను పెంపొందించాల‌నే ఉద్దేశంతో ఈ నిర్ణ‌య‌మ‌న్న స‌ర్కార్‌
హ‌ర్యానా స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఆగ‌స్టు 15 నుంచి అన్ని పాఠ‌శాల‌ల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు 'గుడ్ మార్నింగ్' బ‌దులుగా 'జైహింద్' చెప్పేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విద్యాశాఖ ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించింది.

ఈ మేరకు డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఈ మార్పును తప్పనిసరి చేసింది. ఆగస్టు 15 నుంచి అమలు చేయాలని జిల్లా, బ్లాక్ స్థాయిల్లోని పాఠశాలల ప్రిన్సిపాల్స్, ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. 

విద్యార్థుల్లో దేశ‌భ‌క్తి, ఐక్య‌త‌ను పెంపొందించాల‌నే ఉద్దేశంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు విద్యాశాఖ పేర్కొంది. "జై హింద్"ని రోజువారీ గ్రీటింగ్‌గా ఉపయోగించడం వల్ల జాతీయ ఐక్యత, దేశ‌ గొప్ప చరిత్ర పట్ల గౌరవం ఉండేలా విద్యార్థులకు స్ఫూర్తినిస్తుందని అధికారులు పేర్కొన్నారు.

స్వాతంత్ర్య ఉద్యమంలో నేతాజీ సుభాశ్ చంద్ర‌బోస్ జైహింద్ నినాదంతో ప్ర‌జ‌ల‌ను ఒక్క‌టి చేసిన విష‌యం తెలిసిందే. ఇక స్వాతంత్య్రానంతరం భారతదేశ సార్వభౌమాధికారం, భద్రత పట్ల తమ నిబద్ధతకు చిహ్నంగా దేశ సాయుధ బలగాలు ఈ నినాదాన్ని స్వీకరించాయి.

ఇప్పుడు అదే స్ఫూర్తితో హర్యానా ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఇది విద్యార్థులలో క్రమశిక్షణ, ఐక్యతను పెంపొందిస్తుందన్నారు. అలాగే భారతీయులుగా వారి గుర్తింపును, దేశ భవిష్యత్తుకు వారి సహకారాన్ని ప్ర‌తిరోజు గుర్తుచేస్తుందని అధికారులు చెప్పుకొచ్చారు.


More Telugu News