మనీశ్ సిసోడియాకు బెయిల్ రావడంపై స్పందించిన సునీతా కేజ్రీవాల్

  • ఆలస్యం కావొచ్చు... కానీ న్యాయమే గెలుస్తుందన్న సునీతా
  • కోర్టు ఆదేశాలను గౌరవిస్తున్నామన్న ఢిల్లీ బీజేపీ
  • అభియోగాల నుంచి విముక్తి లభించినట్లు కాదని వ్యాఖ్య
ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు కోర్టు బెయిల్ మంజూరు చేయడంపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ స్పందించారు. మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన ఆయనకు సుప్రీంకోర్టు ఈరోజు బెయిల్‌ను మంజూరు చేసింది. 

ఈ నేపథ్యంలో సునీతా మాట్లాడుతూ... ఆలస్యం కావొచ్చు కానీ న్యాయమే గెలుస్తుందని అర్థం వచ్చేలా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. 'న్యాయం జరగడంలో కొంత ఆలస్యం కావొచ్చు. కానీ, న్యాయం తిరస్కరించబడదు’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.

మద్యం కుంభకోణం కేసులో గత ఏడాది ఫిబ్రవరి 26న సిసోడియాను అరెస్ట్ చేశారు. నాటి నుంచి ఆయన తీహార్ జైల్లోనే ఉంటున్నారు. బెయిల్ కోసం పలుమార్లు పిటిషన్లు దాఖలు చేశారు. 17 నెలలుగా జైలు జీవితాన్ని గడుపుతున్న ఆయనకు సుప్రీంకోర్టులో ఈరోజు భారీ ఊరట లభించింది. సత్యమే గెలిచిందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

సిసోడియాకు బెయిల్ రావడంపై స్పందించిన బీజేపీ

మనీశ్ సిసోడియాకు మద్యం పాలసీ కేసులో సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చిందని, కోర్టు ఆదేశాలను తాము గౌరవిస్తున్నామని ఢిల్లీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ్ అన్నారు. అయితే బెయిల్ వచ్చినంత మాత్రాన అభియోగాల నుంచి విముక్తి లభించినట్లుగా భావించవద్దన్నారు. ఇది పెద్ద స్కాం అని... విచారణ కొనసాగుతోందన్నారు.


More Telugu News