ఒలింపిక్స్‌లో రజతం సాధించడంపై నీరజ్ చోప్రా స్పందన.. కన్నతల్లి ఆసక్తికర వ్యాఖ్యలు

  • త్రో విసురుతున్నప్పుడు గాయంపైకే ఎక్కువ దృష్టిపోతోందన్న భారత స్టార్ అథ్లెట్
  • తనలో ఇంకా చాలా సత్తా ఉందన్న నీరజ్ చోప్రా
  • కొడుకు సాధించిన విజయంపై హర్షం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు
భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్‌ 2024లో గురువారం రాత్రి జరిగిన ఫైనల్‌‌లో రజత పతకాన్ని కొల్లగొట్టాడు. 89.45 మీటర్ల త్రో విసిరి రెండవ స్థానంలో నిలిచాడు. దీంతో వరుస ఒలింపిక్ క్రీడల్లో పతకాలు సాధించిన తొలి భారతీయ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్‌గా అతడు నిలిచాడు. టోక్యో ఒలింపిక్స్‌లో అతడు స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే. 

ఇటీవల గాయాల బారిన పడినప్పటికీ కోలుకొని పారిస్ ఒలింపిక్స్‌లో ఏవిధంగా రాణించాడో నీరజ్ చోప్రా వెల్లడించాడు. త్రో విసిరినప్పుడల్లా తన దృష్టి 60-70 శాతం గాయంపైనే ఉంటుందని నీరజ్ చోప్రా వెల్లడించాడు. ‘‘ఈ రోజు నా పరుగు బాగోలేదు. వేగం కూడా తక్కువగా ఉంది. ఈ రోజు నేను ఏం చేసినా గాయం సమస్యతోనే చేశాను. శస్త్రచికిత్స చేయించుకునేందుకు నాకు సమయం లేదు. నన్ను నేను ముందుకు నెట్టుకున్నాను’’ అని నీరజ్ చోప్రా వెల్లడించాడు.

తనలో ఇంకా చాలా సత్తా ఉందని, తిరిగి పూర్తి సామర్థ్యాన్ని అందిపుచ్చుకోవాలని కోరుకుంటున్నానని నీరజ్ చోప్రా చెప్పాడు. ‘‘ నాలో చాలా సత్తా మిగిలి ఉంది. అది నేను అందుకోవాలి. అది నేను సాధించగలననే నమ్మకం ఉంది. పూర్తి స్థాయి సామర్థ్యాన్ని సాధించకపోతే నేను శాంతించలేను’’ అని వ్యాఖ్యానించాడు. కాగా నీరజ్ కొంతకాలంగా గాయాలతో బాధపడుతున్నాడు. ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి ముందు కేవలం మూడు ఈవెంట్‌లలో మాత్రమే అతడు పాల్గొన్నాడు.

నీరజ్ తల్లిదండ్రుల స్పందన ఇదే
నీరజ్ చోప్రా రజత పతకం సాధించడంపై తండ్రి సతీష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. తన కొడుకు సాధించిన విజయం పట్ల గర్వంగా ఉందని చెప్పారు. పాక్ అథ్లెట్ స్వర్ణం గెలవడంపై స్పందిస్తూ.. ఇది పాకిస్థాన్ రోజు అని వ్యాఖ్యానించారు. నీరజ్ చోప్రా ప్రదర్శనలో అతడి గాయం పాత్ర కూడా ఉందని వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరికీ ఒక రోజు వస్తుందని, ఈ రోజు పాకిస్థాన్ రోజు అని అన్నారు. అయినప్పటికీ నీరజ్ చోప్రా రతజం గెలిచాడని చెప్పారు.

నీరజ్ చోప్రా తల్లి సరోజ్ దేవి స్పందిస్తూ.. తన కొడుకు రజత పతకం సాధించడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. తన కొడుక్కి ఇష్టమైన ఆహారం వండి పెట్టేందుకు అతడి కోసం ఎదురుచూస్తుంటానని ఆమె చెప్పారు. ఇక స్వర్ణం గెలిచిన పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ కూడా తన కొడుకు లాంటి వాడేనని వ్యాఖ్యానించారు.


More Telugu News