భారత హాకీ జట్టుకు అభినందనలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ

  • పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు కాంస్యం
  • భారత్ ఖాతాలో నాలుగో పతకం
  • 52 ఏళ్ల తర్వాత వరుసగా రెండు ఒలింపిక్స్ ల్లో పతకాలు సాధించిన హాకీ జట్టు
  • 2020 టోక్యో ఒలింపిక్స్ లోనూ కాంస్యం సాధించిన భారత్
పారిస్ ఒలింపిక్స్ లో కాంస్యం సాధించిన భారత హాకీ జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. 52 ఏళ్ల తర్వాత వరుసగా రెండు ఒలింపిక్స్ పోటీల్లో భారత హాకీ జట్టు పతకాలు కైవసం చేసుకుంది. 2020 టోక్యో ఒలింపిక్స్ లోనూ భారత్ కాంస్యం నెగ్గింది. ఈ నేపథ్యంలో, భారత హాకీ జట్టును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. 

"కాంస్యం సాధించిన మన హాకీ జట్టుకు హృదయపూర్వక శుభాకాంక్షలు. భారత హాకీ జట్టు యావత్ దేశం గర్వించేలా చేసింది. ఒలింపిక్ క్రీడల్లో భారత హాకీ జట్టు నిలకడ, నైపుణ్యం, పోరాట స్ఫూర్తిని చాటింది. భారత హాకీ జట్టు యువతకు ఆదర్శంగా నిలుస్తుంది" అంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఓ ప్రకటన విడుదల చేశారు. 

ప్రధాని మోదీ స్పందిస్తూ, ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు మెరిసిందని కొనియాడారు. ఒలింపిక్ క్రీడల్లో భారత హాకీ జట్టు వరుసగా రెండో పతకం సాధించిందని వివరించారు. ఇవాళ కాంస్యం గెలవడం ద్వారా భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయక ప్రదర్శన చేశారని అభినందించారు. భారత హాకీ జట్టు సమష్టి స్ఫూర్తిని చాటిందని పేర్కొన్నారు. ప్రతి భారతీయుడికి హాకీతో మంచి అనుబంధం ఉందని, ఈ విజయం దేశంలో హాకీ క్రీడ మరింత ప్రాచుర్యం పొందేలా చేస్తుందని వివరించారు. 

విపక్ష నేత రాహుల్ గాంధీ కూడా భారత హాకీ జట్టుకు అభినందనలు తెలిపారు. భారత హాకీ జట్టు పారిస్ ఒలింపిక్స్ లో కాంస్యం సాధించడం గర్వంగా ఉందని తెలిపారు. గోల్ కీపర్ శ్రీజేశ్ నిబద్ధత స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు.


More Telugu News