షేక్ హసీనా భారత్ ను ఎప్పుడు వీడుతారో చెప్పలేం: విదేశాంగ శాఖ

  • బంగ్లాదేశ్ లో ఇప్పటికీ హింసాత్మక వాతావరణం
  • ఢాకాను వీడి భారత్ కు వచ్చిన షేక్ హసీనా
  • షేక్ హసీనా భవిష్యత్ ప్రణాళికలు తమకు తెలియవన్న భారత విదేశాంగ శాఖ
బంగ్లాదేశ్ లో ఇప్పటికీ కల్లోలం సద్దుమణగలేదు. దేశంలో ఇంకా హింసాకాండ కొనసాగుతోంది. తాజా పరిణామాలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. 

బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలే భారత్ కు ముఖ్యమని వెల్లడించింది. బంగ్లాదేశ్ లో మైనారిటీ వర్గాలపై దాడుల ఘటనలను గమనిస్తున్నామని తెలిపింది. బంగ్లాదేశ్ లోని భారతీయుల భద్రతపై అధికారులను సంప్రదిస్తున్నామని విదేశాంగ శాఖ పేర్కొంది. పొరుగుదేశంలో శాంతిభద్రతల పునరుద్ధరణ త్వరగా జరగాలని ఆశిస్తున్నామని తెలిపింది. 

బంగ్లాదేశ్ లో ఇప్పటికీ ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయని, ఇది ఆందోళన కలిగించే అంశమని వెల్లడించింది. ఇక, ప్రధాని పదవికి రాజీనామా చేసి ఢాకా నుంచి భారత్ వచ్చిన షేక్ హసీనా ఎప్పుడు భారత్ ను వీడుతారనేది చెప్పలేమని, షేక్ హసీనా భవిష్యత్ ప్రణాళిక గురించి తెలియదని విదేశాంగ శాఖ వివరించింది.


More Telugu News