వినేశ్ ఫొగాట్ బాధను అర్థం చేసుకోగలను: గోల్డ్ మెడల్ గెలిచిన అమెరికా రెజ్లర్

  • అనర్హత వేటు పడటం బాధాకరమన్న సారా హిల్డర్ బ్రాంట్
  • బరువు విషయంలో తాను కూడా చాలా కష్టపడ్డానని  వెల్లడి 
  • ఫొగాట్ కష్టాన్ని తాను అర్థం చేసుకోగలనన్న అమెరికా రెజ్లర్
భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడిన అంశంపై ప్యారిస్ ఒలింపిక్స్‌లో బంగారం పతకం గెలిచిన అమెరికా రెజ్లర్ సారా హిల్డర్ బ్రాంట్ స్పందించారు. బుధవారం రాత్రి జరిగిన ఫైనల్‌లో ఆమె క్యూబా రెజ్లర్ గుజ్మన్ లోపేజ్‌పై విజయం సాధించారు. లోపేజ్‌కు రజతం దక్కగా, జపాన్, చైనా రెజ్లర్లు కాంస్యాలు సాధించారు. గెలుపు అనంతరం మాట్లాడిన సారా హిల్డర్... వినేశ్ ఫొగాట్ బరువుపై స్పందించారు.

వినేశ్ ఫొగాట్ బాధను తాను అర్థం చేసుకోగలనన్నారు. ఫొగాట్ గొప్ప రెజ్లర్... ఆమెపై అనర్హత వేటు పడటం బాధాకరం అన్నారు. బరువు విషయంలో తాను కూడా చాలా కష్టపడ్డానని, కాబట్టి ఆమె కష్టాన్ని తాను అర్థం చేసుకోగలనన్నారు. ఫొగాట్‌పై అనర్హత విషయం తెలిగానే ఒలింపిక్స్ విజేతను తానే అని భావించానని... కానీ గంట వ్యవధిలోనే లోపేజ్‌తో తలపడాలని తెలిసిందన్నారు. దీంతో తన ఆనందానికి బ్రేక్ పడిందన్నారు. లోపేజ్‌తో పోటీలో గెలిచి తాను పసిడిని అందుకోవడం ఆనందంగా ఉందన్నారు.

తాను కూడా బరువు తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అందుకోసం ఎంతో సాధన చేశానన్నారు. వినేశ్ విషయంలో ఇలా జరుగుతుందనుకోలేదని అన్నారు. సెమీస్‌లో ఆమె అద్భుతంగా ఆడిందని, అలాంటి రెజ్లర్‌కు ఈ ఒలింపిక్స్ ఇలా ముగుస్తుందనుకోలేదన్నారు. ఆమెకు మద్దతు తెలుపుతున్నానని... రెజ్లర్‌గానే కాకుండా వ్యక్తిగతంగానూ ఆమె మంచి మనిషి అన్నారు.


More Telugu News