హ‌ర్యానా స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం.. వినేశ్‌కు ర‌జ‌త ప‌త‌క విజేత‌కు ద‌క్కే అన్ని రివార్డులు, సౌక‌ర్యాలు!

  • వినేశ్‌ ఇప్పటికీ ఛాంపియ‌నేన‌ని కొనియాడిన సీఎం న‌యాబ్ సైనీ
  • ఒలింపిక్ మెడ‌లిస్ట్ మాదిరిగానే ఆమెకు స్వాగ‌తం ప‌లుకుతామ‌న్న సీఎం
  • అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో ఫైన‌ల్ వ‌ర‌కు వెళ్లిందంటూ ప్ర‌శంస‌
భార‌త స్టార్ రెజ్ల‌ర్ వినేశ్ ఫోగాట్ పారిస్ ఒలింపిక్స్ మ‌హిళ‌ల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ 50 కిలోల విభాగంలో ఫైనల్ నుంచి అధిక బ‌రువు కార‌ణంగా నిష్క్ర‌మించిన విష‌యం తెలిసిందే. దీంతో యావ‌త్ భార‌త్ షాక్‌కు గుర‌యింది. ప‌త‌కం ఖాయం అనుకున్న స‌మ‌యంలో ఇలా అర్థాంత‌రంగా పోటీల నుంచి నిష్క్ర‌మించ‌డం అందరికి షాకిచ్చింది. 

ఈ క్ర‌మంలో వినేశ్‌ స్వ‌రాష్ట్రం హ‌ర్యానా ఆమెకు మ‌ద్ధ‌తుగా నిలిచింది. తాజాగా అక్క‌డి స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. వినేశ్‌కు ర‌జ‌త ప‌త‌క విజేత‌కు ద‌క్కే అన్ని స‌న్మానాలు, రివార్డులు, సౌక‌ర్యాలు అందిస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి న‌యాబ్ సైనీ ఎక్స్ (ట్విట్ట‌ర్) వేదిక‌గా ప్ర‌క‌టించారు. వినేశ్‌ ఛాంపియ‌నేన‌ని ఈ సంద‌ర్భంగా ఆమెను హ‌ర్యానా ముఖ్య‌మంత్రి కొనియాడారు.  

"అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో ఫైన‌ల్ వ‌ర‌కు వెళ్లింది. ఏ కార‌ణంతోనైనా ఆమె ఫైన‌ల్ ఆడ‌క‌పోవ‌చ్చు. కానీ మాకు ఆమె ఛాంపియ‌నే. ఈ నేప‌థ్యంలోనే మా స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఒలింపిక్ మెడ‌లిస్ట్ మాదిరిగానే ఆమెకు స్వాగ‌తం ప‌ల‌కాల‌ని మా ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఒలింపిక్ ర‌జ‌త ప‌త‌క విజేత‌కు ద‌క్కే అన్ని స‌న్మానాలు, రివార్డులు, సౌక‌ర్యాలను వినేశ్‌కు అందిస్తామ‌ని" అని తెలిపారు.


More Telugu News