ఆ పథకానికి ఎన్టీఆర్ పేరే కరెక్ట్: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

  • క్యాబినెట్ భేటీ అనంతరం రాజకీయ అంశాలపై చర్చ
  • అన్న క్యాంటీన్ల ప్రస్తావన
  • మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు సబబు అని పవన్ వెల్లడి
  • క్యాంటీన్లు ఎన్టీఆర్ పేరు మీదే కొనసాగించాలని స్పష్టీకరణ
ఏపీ సర్కారు ఈ నెల 15వ తేదీన రాష్ట్రంలో 100 అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15న ప్రారంభించే క్యాంటీన్లకు పేరు విషయంలో నేటి క్యాబినెట్ సమావేశం అనంతరం ఒక ఆసక్తికర చర్చ చోటు చేసుకుంది. 

ఈ క్యాంటీన్లకు ఎన్టీఆర్ పేరుతో అన్న క్యాంటీన్లు అని కొనసాగించాలా, లేక డొక్కా సీతమ్మ పేరు కూడా జోడించాలా అనే చర్చ వచ్చింది. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. 

2019 వరకు ఉన్న విధంగానే అన్న క్యాంటీన్లు అని కొనసాగించాలని సూచించారు. అపర అన్నపూర్ణగా ఖ్యాతి గాంచిన డొక్కా సీతమ్మ పేరు పాఠశాల మధ్యాహ్న భోజన పథకానికి నిర్ణయించిన క్రమంలో... క్యాంటీన్లకు ఎన్టీఆర్ పేరు కొనసాగించవచ్చని పవన్ ప్రతిపాదించారు. మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు సబబుగా ఉంటుందని, ప్రభుత్వం నిర్వహించే క్యాంటీన్లను ఎన్టీఆర్ పేరుతో కొనసాగించాలని స్పష్టం చేశారు. 

డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజన పథకం నిర్వహించడం వల్ల డొక్కా సీతమ్మ గొప్పదనం ప్రతి విద్యార్థికి తెలుస్తుందని, ఈ విధంగా విశిష్ట వ్యక్తులు, దాతృత్వం కలిగినవారి పేరు మీద పథకాలు ఉండడం వల్ల భావితరాలకు మేలు కలుగుతుందని పవన్ కల్యాణ్ వివరించారు.


More Telugu News