బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ ప్రచారం... స్పందించిన బాల్క సుమన్

  • పాతికేళ్లుగా ఇలాంటి మాటలు వింటూనే ఉన్నామని ఆగ్రహం
  • తెలంగాణ ఏర్పాటుకు కారణమైన వారు ఉండొద్దనుకుంటున్నారని ఆగ్రహం
  • ఇంటి పార్టీగా తెలంగాణలో బీఆర్ఎస్ కచ్చితంగా ఉంటుందని వ్యాఖ్య
బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందనే ప్రచారంపై బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పాతికేళ్ళుగా ఇలాంటి మాటలు వింటూనే ఉన్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించేవారు, ఈ రాష్ట్ర పుట్టుకను భరించలేని వారు, ఈ రాష్ట్ర ప్రగతిని ఇష్టపడనివారు, తెలంగాణ అస్తిత్వాన్ని జీర్ణించుకోలేనివారే తమ పార్టీని ఉండవద్దని కోరుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటుకు... అస్తిత్వానికి కారణమైన పార్టీ ఉండవద్దని వారు భావిస్తున్నారన్నారు.

అలాంటి భ్రమల్లోనే 24 ఏళ్లుగా ఉంటున్నవారు... ఏదో ఒక సందర్భంలో ఆరోపణలు చేస్తూనే ఉన్నారని బాల్క సుమన్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తమ పార్టీ 14 ఏళ్లు పోరాటం చేసిందన్నారు. ఈ పదేళ్ల కాలంలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణను దేశంలోనే సమున్నతంగా నిలిపామన్నారు. రానున్న రోజుల్లోనూ తమ పార్టీ ఇంటి పార్టీగా కచ్చితంగా ఉంటుందన్నారు. తాము కచ్చితంగా తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతామన్నారు.

ప్రజలకు ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కచ్చితంగా నిలదీస్తామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారెంటీలు అమలు చేసేదాకా వెంటపడతామన్నారు. విలీనం అంటూ మాట్లాడే చిల్లర మాటలను తాము పట్టించుకోమన్నారు. తమ పార్టీ బ్రహ్మాండంగా ఉందని, మరో 100 ఏళ్లు తమ పార్టీ సుస్థిరంగా ఉంటుందని బాల్క సుమన్ ధీమా వ్యక్తం చేశారు.


More Telugu News