వినేశ్ ఫోగాట్‌పై అనర్హత వేటు వెనుక కుట్ర ఉందన్న కాంగ్రెస్ ఎంపీ

  • భార‌త రెజ్ల‌ర్ వినేశ్ ఫోగాట్‌పై ఆఖ‌రి నిమిషంలో అన‌ర్హ‌త వేటు
  • 100 గ్రాముల అధిక బ‌రువు కార‌ణంగా ఆమెపై వేటు 
  • మాజీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకు వినేశ్‌ తన పతకాన్ని కోల్పోయార‌న్న బ‌ల్వంత్ వాంఖ‌డే
భార‌త రెజ్ల‌ర్ వినేశ్ ఫోగాట్‌పై ఆఖ‌రి నిమిషంలో అన‌ర్హ‌త వేటు ప‌డ‌డంతో ఇవాళ రాత్రి ఆడాల్సిన మ‌హిళ‌ల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ 50 కిలోల విభాగం ఫైన‌ల్స్ నుంచి త‌ప్పుకోవాల్సి వ‌చ్చింది. 100 గ్రాముల అధిక బ‌రువు కార‌ణంగా ఆమెపై వేటు ప‌డిన విష‌యం తెలిసిందే. ఇది యావ‌త్ భార‌త్‌ను షాక్‌కు గురి చేసింది. త‌ప్ప‌కుండా ప‌త‌కం వ‌స్తుంద‌నుకున్న ఈవెంట్ నుంచి ఆమె ఇలా అర్ధాంత‌రంగా వైదొల‌గ‌డం తీవ్ర నిరాశ‌కు గురి చేసింది.  

తాజాగా దీనిపై కాంగ్రెస్ ఎంపీ బ‌ల్వంత్ వాంఖ‌డే స్పందించారు. బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌సింగ్‌కు వ్యతిరేకంగా నిరసనను వ్యక్తం చేసినందుకు రెజ్లర్ వినేశ్‌ ఫోగాట్ తన పతకాన్ని కోల్పోయారని వాంఖడే పేర్కొన్నారు. 

"ఇది చాలా బాధాకరమైన వార్త. దీని వెనుక ఏదో కుట్ర ఉంది. ఆమె జంతర్ మంతర్ వద్ద నిరసన తెలపడం దేశం మొత్తానికి తెలుసు. ఆమెకు న్యాయం జరగలేదు. ఇప్పుడు ఆమె గెలిస్తే, వారు ఆమెను గౌరవించవలసి ఉంటుంది. ఇది వారికి ఇష్టం లేదు" అని చెప్పుకొచ్చారు. 

కాగా, తమ‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై జంతర్ మంతర్ వద్ద వివాదాస్పద రాజకీయ నాయకుడికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన ప‌లువురు అంతర్జాతీయ మ‌హిళా రెజ్లర్లలో వినేశ్ ఫోగాట్ ఒకరు. దాంతో రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్‌గా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌ను తొలగించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఆయనకు టికెట్ కూడా ఇవ్వ‌లేదు. అయితే, ఆయన కుమారుడు బీజేపీ పార్టీ టికెట్‌పై ఆయన స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు.


More Telugu News