స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత... ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు ఇవిగో!

  • సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ సమావేశం
  • సమావేశం అనంతరం మీడియాకు వివరాలు తెలిపిన మంత్రి పార్థసారథి
  • ఏపీలో సంతానోత్పత్తి రేటుపై క్యాబినెట్ లో చర్చించామని వెల్లడి
  • రీసర్వేపై నోట్ సమర్పించిన రెవెన్యూ శాఖ
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరిగింది. రాష్ట్ర సచివాలయంలో క్యాబినెట్ భేటీ ముగిసిన అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరాలు తెలిపారు. 

రాష్ట్రంలోని మత్స్యకారుల జీవనప్రమాణాలు మెరుగుపడాలన్న ఉద్దేశంతో చెరువులను నామమాత్రపు లీజుతో మత్స్యకార సహకార సొసైటీలకు కేటాయించేవారని, కానీ గత ప్రభుత్వం నెల్లూరు జిల్లాలో 25,360 హెక్టార్లలో చేపల చెరువులను బహిరంగ వేలానికి అనుమతి ఇస్తూ రెండు జీవోలు తీసుకువచ్చారని ఆరోపించారు. తద్వారా పేద మత్స్యకారులకు తీవ్ర నష్టం కలుగజేసిందని అన్నారు. దీనిపై మత్స్యకార సంఘాలు, ప్రజా సంఘాలు కోర్టులకు కూడా వెళ్లాయని తెలిపారు. 

ఇప్పుడు ఆ రెండు జీవోలను రద్దు చేయాలని క్యాబినెట్ భేటీలో నిర్ణయించామని, గతంలో ఉన్న మాదిరే మత్స్యకార సహకార సొసైటీలకు నామమాత్రపు లీజుతో కేటాయిస్తామని మంత్రి పార్థసారథి వివరించారు. ఇక, దేశంలో సంతాన సాఫల్య రేటు తగ్గిపోతోందని చాలా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయని, ప్రపంచ గణాంకాలను, జాతీయ గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే ఏపీలో సంతాన సామర్థ్య రేటు తక్కువగా ఉందని మంత్రి పార్థసారథి తెలిపారు. 

"జాతీయ స్థాయిలో సంతానోత్పత్తి సామర్థ్య రేటు 2.1 గా ఉంటే, అది ఏపీలో 1.5గా ఉంది. ఈ పరిస్థితుల్లో జనాభా నిర్వహణ పట్ల ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఏపీలో యువ జనాభా తగ్గిపోయే ప్రమాదం నెలకొంది. ఈ సమస్య అంతర్జాతీయంగా కూడా ఉంది. కొన్ని దేశాలు వయోవృద్ధులతో నిండిపోయి ఓల్డ్ ఏజ్ హోమ్స్ గా మారిపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. 

ఈ నేపథ్యంలో, రాష్ట్రంలో సంతానోత్పత్తి  రేటు తగ్గిపోతోందన్న గణాంకాలను కూడా నేటి క్యాబినెట్ సమావేశంలో చర్చించాం. దీనిపై విస్తృతస్థాయిలో చర్చించాల్సిన అవసరం ఉందని గుర్తించాం. ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ సంతానం కలిగి ఉన్న వారు మున్సిపల్ ఎన్నికల్లో పాల్గొనరాదని గతంలో చేసిన చట్ట సవరణల రద్దుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో కూడా ఇటువంటి నిబంధనే ఉంది. దీన్ని కూడా ఎత్తివేసేందుకు నిర్ణయించాం" అని వివరించారు. 

నేటి క్యాబినెట్  సమావేశంలో భూముల రీసర్వేపై రెవెన్యూ శాఖ నోట్ సమర్పించింది. రీ సర్వే వల్ల ఉత్పన్నమైన వివాదాలపై మంత్రివర్గం చర్చించింది. జగన్ బొమ్మ, పేరు ఉన్న సర్వే రాళ్లను ఏం చేయాలనే అంశంపై చర్చించారు. సర్వే రాళ్లపై జగన్ బొమ్మ, పేరు తొలగించాలని మంత్రులు సూచించారు. బొమ్మల పిచ్చితో గత ముఖ్యమంత్రి రూ.700 కోట్లు దుబారా చేశారని మంత్రులు విమర్శించారు. రీసర్వేతో భూ యజమానుల్లో ఆందోళనలు పెరిగి, గ్రామాల్లో వివాదాలకు దారితీస్తాయని పేర్కొన్నారు. 

ఇక, జగన్ బొమ్మతో ఉన్న పట్టాదార్ పాస్ బుక్ లను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మావోయిస్టుల అంశంపైనా క్యాబినెట్ చర్చించింది. మావోయిస్టులపై ఉన్న నిషేధాన్ని మరో ఏడాది పొడిగిస్తూ క్యాబినెట్ తీర్మానం చేసింది. గత వైసీపీ ప్రభుత్వం అనుసరించిన మద్యం విధానం కూడా నేటి సమావేశంలో చర్చకు వచ్చింది. అక్రమాలకు అవకాశం లేని రీతిలో ఎక్సైజ్ విధానంలో మార్పులు, చేర్పులపై చర్చించారు.


More Telugu News