నీర‌జ్ చోప్రా గోల్డ్ గెలిస్తే.. అభిమానుల‌కు రిష‌భ్ పంత్ బంప‌రాఫ‌ర్‌!

  • అభిమానుల్లో ఒక‌రికి రూ. 1,00,089 బ‌హుమ‌తిగా ఇస్తాన‌ని 'ఎక్స్‌'లో ప్ర‌క‌ట‌న‌
  • ఈ ట్వీట్‌ను లైక్ చేసి, అత్య‌ధికంగా కామెంట్ చేసిన వారికి ఈ న‌గ‌దు బ‌హుమ‌తి
  • అలాగే అత్య‌ధికంగా కామెంట్స్ చేసిన‌వారిలో తొలి 10 మందికి విమాన టికెట్లు
  • నిన్న‌టి క్వాలిఫ‌య‌ర్ రౌండ్‌లో జావెలిన్ ను 89.34 మీటర్ల దూరం విసిరిన నీర‌జ్‌
పారిస్ ఒలింపిక్స్‌లో గోల్డెన్ బాయ్ నీర‌జ్ చోప్రా గురువారం జ‌రిగే ఫైన‌ల్‌లో స్వ‌ర్ణ ప‌త‌కం గెలిస్తే.. అభిమానుల‌కు భార‌త క్రికెట‌ర్‌ రిష‌భ్ పంత్ బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించాడు. అభిమానుల్లో ఒక‌రికి రూ. 1,00,089 బ‌హుమ‌తిగా ఇస్తాన‌ని తెలిపాడు. ఈ మేర‌కు 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) లో ఓ ప్ర‌త్యేక పోస్ట్ పెట్టాడు.

ఈ ట్వీట్‌ను లైక్ చేసి, అత్య‌ధికంగా కామెంట్ చేసిన వారికి అది ద‌క్కుతుంద‌న్నాడు. అలాగే అత్య‌ధికంగా కామెంట్స్ చేసిన‌వారిలో తొలి 10 మందికి విమాన టికెట్లు ఇస్తాని పేర్కొన్నాడు. ఈ సంద‌ర్భంగా 'భార‌త్‌తో పాటు దేశం బ‌య‌టి నుంచి కూడా నా సోద‌రుడికి మ‌ద్ద‌తు కూడ‌గ‌డ‌దాం' అని పంత్ పిలుపునిచ్చాడు. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట వైర‌ల్ అవుతోంది. 

కాగా, మంగ‌ళ‌వారం జ‌రిగిన క్వాలిఫికేష‌న్ రౌండ్‌లో నీర‌జ్ చోప్రా అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో ఫైన‌ల్‌కు దూసుకెళ్లిన విష‌యం తెలిసిందే. త‌న తొలి ప్ర‌య‌త్నంలోనే ఆయ‌న జావెలిన్‌ను ఏకంగా 89.34 మీటర్ల దూరం విసిరి ఫైన‌ల్‌కు అర్హ‌త సాధించాడు. 

ఫైన‌ల్‌కు అర్హ‌త సాధించిన వారిలో మ‌నోడే టాప్‌. ఆ త‌ర్వాతి స్థానాల్లో వ‌రుస‌గా గ్రెనడాకు చెందిన‌ ఆండర్సన్ పీటర్స్ (88.63మీ), జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ (87.76మీ), పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ న‌దీమ్ ( 86.59 మీ) నిలిచారు. 

ఇక 2021 టోక్యో ఒలింపిక్స్‌లో నీర‌జ్ చోప్రా ఈటెను 87.58 మీటర్ల దూరం విసిరి స్వర్ణ ప‌త‌కాన్ని గెలుచుకున్న విష‌యం తెలిసిందే. రేపు ఫైన‌ల్లో మ‌రోసారి ఇదే ఫీట్‌ను రిపీట్ చేసి రెండో గోల్డ్‌ను గెల‌వాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.


More Telugu News