వైసీపీకి విశాఖపట్నం కార్పొరేటర్ల షాక్

  • వైసీపీకి చెందిన పలువురు జీవీఎంసీ కార్పొరేటర్ లు, మాజీ కార్పొరేటర్ లు జనసేన పార్టీలో చేరిక
  • పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన అధినేత పవన్ కల్యాణ్ 
  • విశాఖ దక్షిణ జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో చేరికలు  
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన పలువురు వైసీపీ కార్పొరేటర్ లు ఆ పార్టీకి షాక్ ఇచ్చి జనసేన పార్టీలో చేరారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నాడు పార్టీ అధినేత, డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. జీవీఎంసీ 42,43,47,59,77వ వార్డు కార్పొరేటర్ లతో పాటు పలువురు మాజీ కార్పొరేటర్ లు, కనకమహాలక్ష్మి ఆలయ మాజీ చైర్మన్ కర్రిపోతుల ప్రసాద్, లోక్ సత్తా జోనల్ మాజీ నాయకుడు మంచిపల్లి సత్యనారాయణ తదితరులు విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు.  
 
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ .. ఎన్నికల తర్వాత మొట్టమొదటి రాజకీయపరమైన చేరికలు ఇవి అన్నారు. తనకు ఎంతో ఇష్టమైన విశాఖ నుంచి చేరికలు మొదలు కావడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి తరపున బలంగా విజయం సాధించే విధంగా అంతా కృషి చేయాలని పిలుపు నిచ్చారు.
 
విశాఖలో పొల్యూషన్ ఆడిట్ నిర్వహిస్తాం

విశాఖలో కాలుష్య సమస్య చాలా ఎక్కువగా ఉందని, దేశంలోనే వాయు, జల కాలుష్యం ఎక్కువగా ఉన్న నగరంగా విశాఖ ఉందని అన్నారు. కార్పొరేటర్లుగా కాలుష్య నియంత్రణ బాధ్యత వారిపై ఉందని చెప్పారు. పర్యావరణ శాఖ మంత్రిగా కాలుష్య నియంత్రణ మండలి తన పరిధిలో ఉందని, ఎక్కడైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని పవన్ కల్యాణ్ సూచించారు. విశాఖలో పొల్యూషన్ ఆడిట్ నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.


More Telugu News