ఏపీలో యూట్యూబ్ అకాడమీ... గూగుల్ తో చర్చించిన సీఎం చంద్రబాబు

  • యూట్యూబ్ సీఈవో, గూగుల్ ఆసియా పసిఫిక్ హెడ్ తో చంద్రబాబు సమావేశం
  • ఈ ఆన్ లైన్ సమావేశం ఎంతో సంతోషం కలిగించిందంటూ ట్వీట్
  • మీడియా సిటీ ప్రస్తావన తెచ్చిన ముఖ్యమంత్రి 
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ యూట్యూబ్ గ్లోబల్ సీఈవో నీల్ మోహన్, గూగుల్ ఆసియా పసిఫిక్ హెడ్ సంజయ్ గుప్తాలతో ఆన్ లైన్ లో సమావేశమయ్యారు. ఏపీలో స్థానిక  భాగస్వామ్యంతో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటు చేయడంపై చంద్రబాబు వారితో చర్చించారు. 

ఈ సమావేశం ఎంతో సంతోషం కలిగించిందని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), కంటెంట్ డెవలప్ మెంట్, స్కిల్ డెవలప్ మెంట్, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ లను ప్రోత్సహించేలా ఈ యూట్యూబ్ అకాడమీ ఉండాలని అభిలషిస్తున్నట్టు తెలిపారు. 

అంతేకాకుండా, ఏపీ రాజధాని అమరావతిలో మీడియా సిటీ ఏర్పాటుకు సాంకేతిక మద్దతును అందించే దిశగా పలు విధానాలను పరిశీలించామని చంద్రబాబు తన ట్వీట్ లో వివరించారు. అమరావతి రాజధానిలో భాగంగా మొత్తం 9 థీమ్ సిటీలను ఏర్పాటు చేయాలని చంద్రబాబు సంకల్పించారు. వాటిలో ఒకటి మీడియా సిటీ.


More Telugu News