పాఠశాల విద్యలో ఏపీ మోడల్ రూపకల్పనకు చర్యలు చేపట్టండి: మంత్రి నారా లోకేశ్

  • ఉండవల్లి నివాసంలో విద్యాశాఖపై మంత్రి నారా లోకేశ్ సమీక్ష
  • విద్యార్థులను క్రీడలు, సాంస్కృతిక అంశాల్లోనూ ప్రోత్సహించాలని సూచన
  • కేజీబీవీ స్కూళ్లలో టీచర్ల భర్తీ పారదర్శకంగా నిర్వహించాలని స్పష్టీకరణ
  • ప్రతిభ ఆధారంగానే ఎంపిక ఉండాలని దిశానిర్దేశం
పాఠశాల విద్యలో దేశంలోనే అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తూ ఏపీ మోడల్ రూపకల్పనకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఇవాళ ఆయన పాఠశాల విద్య ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ... కేవలం పాఠ్యాంశాల్లో మాత్రమే కాకుండా స్పోర్ట్స్, కల్చరల్ ఈవెంట్స్ లో కూడా విద్యార్థులను ప్రోత్సహించాలని అన్నారు. పాఠశాలల్లో విద్యాప్రమాణాల మెరుగుదలకు తల్లిదండ్రులు, స్కూల్ కమిటీల భాగస్వామ్యంతో మోడల్ పేరెంట్ టీచర్స్ సమావేశాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. 

కేజీబీవీ స్కూళ్లలో టీచింగ్ పోస్టుల భర్తీని పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని, నూరు శాతం అకడమిక్ ప్రతిభ ఆధారంగా టీచర్లను ఎంపికచేయాలని ఆదేశించారు. ప్రతి తరగతికి కనీసం ఒక టీచర్ ఉండేలా టీచర్లను సర్దుబాటు చేయాలని సూచించారు. అతి త్వరలో స్కూల్ అక్రిడిటేషన్ ఫ్రేమ్ వర్క్ సిద్ధం చేయాలని, ఇందులో భాగంగా ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టిసారించాలని కోరారు. 

ప్రతి స్టూడెంట్ కి ఒక ప్రత్యేకమైన ఐడీ కోడ్ ఇవ్వాలని, దీని ద్వారా విద్యార్థుల అకడమిక్ ట్రాక్ రికార్డును అధ్యయనం చేసి వారికి నాణ్యమైన విద్య అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 

సెప్టెంబర్ 5న గురుపూజోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వందమందికి పైగా ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఉపాధ్యాయుల ఎంపిక పూర్తి పారదర్శకంగా ఉండాలని స్పష్టం చేశారు. విద్యార్థులకు పంపిణీ చేసే ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో గతంలో దొర్లిన తప్పులపై సమీక్షించి సరిచేయాలని సూచించారు. ఎక్స్ పీరియన్స్ లెర్నింగ్ లో భాగంగా పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్ ఎక్విప్ మెంట్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని మంత్రి నారా లోకేశ్ నిర్దేశించారు. 

రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న 6 మైనర్ మీడియం విద్యార్థులకు ఇంగ్లీషు మీడియంతోపాటు వారి మాతృభాషపై కూడా పట్టు సాధించేలా పాఠ్యాంశాల రూపకల్పనకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 

ఈ సమావేశంలో పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి కోన శశిధర్, పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజు, ఇంటర్మీడియట్ విద్య డైరక్టర్ కృతికా శుక్లా, రాష్ట్ర సర్వ శిక్ష అభియాన్ ప్రాజెక్టు డైరక్టర్ బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.


More Telugu News