రుణమాఫీ కాలేదని రైతులు ఫోన్ చేసి మరీ చెబుతున్నారు: కిషన్ రెడ్డి

  • రుణమాఫీపై కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశామన్న కిషన్ రెడ్డి
  • రుణమాఫీకి ప్రాతిపదిక ఏమిటో రైతులకు తెలియడం లేదన్న కేంద్రమంత్రి
  • కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని విమర్శ
బీజేపీ కార్యాలయంలో రుణమాఫీకి సంబంధించి కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశామని, దీనికి వేల ఫోన్ కాల్స్ వస్తున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో 'హర్ ఘర్ తిరంగా', స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదన్నారు.

బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్‌కు చాలా ఫోన్లు వస్తున్నాయని, తమకు రుణమాఫీ కాలేదని రైతులు ఫోన్ చేసి మరీ చెబుతున్నారన్నారు. రుణమాఫీ కాకపోవడంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. రుణమాఫీకి ప్రాతిపదిక ఏమిటో తెలియడం లేదని రైతులు చెబుతున్నారన్నారు. 

వచ్చే నాలుగున్నరేళ్లు బీజేపీ నేతలు కష్టపడి పని చేయాలని సూచించారు. తెలంగాణలో బీజేపీకి 36 శాతం మంది ఓటేశారని గుర్తు చేశారు. ప్రజల తీర్పును సవాల్‌గా తీసుకొని అంకితభావంతో పని చేయాలని పిలుపునిచ్చారు. ఆగస్ట్ 15న ఎర్రకోటపై 11వసారి మోదీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నారన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరాలన్నారు.


More Telugu News