బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇంటిని కూడా తగలబెట్టేశారు!

  • బంగ్లాదేశ్‌లో ఇంకా ఆగ‌ని నిర‌స‌న‌లు
  • మాజీ క్రికెట్ కెప్టెన్ మోర్తజా ఇంటికి నిప్పుపెట్టిన ఆందోళ‌న‌కారులు
  • ఆయ‌న కూడా హ‌సీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ ఎంపీ కావ‌డ‌మే కార‌ణం
బంగ్లాదేశ్‌లో నిర‌స‌న‌కారులు విధ్వంసం సృష్టిస్తున్న విష‌యం తెలిసిందే. రిజ‌ర్వేష‌న్ కోటాకు వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌కారులు చేప‌ట్టిన‌ నిర‌స‌న ర్యాలీలు హింసాత్మ‌కంగా మార‌డంతో భారీ మొత్తంలో ప్రాణ‌న‌ష్టం జ‌రుగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు 400 మంది వ‌ర‌కు ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోయారు. ఆందోళ‌న‌కారులు ప్ర‌ధాని షేక్ హ‌సీనా రాజీనామాకు ప‌ట్టుబ‌ట్ట‌డంతో ఆమె త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. అనంత‌రం ఆమె దేశం విడిచిపెట్టి వెళ్లిపోయారు. 

అయినా ఆ దేశంలో నిర‌స‌న‌కారుల ఆందోళ‌న‌లు ఆగ‌డం లేదు. తాజాగా వారు ఆ దేశ మాజీ క్రికెట్ కెప్టెన్ మష్రఫే బిన్ మోర్తజా ఇంటికి నిప్పుపెట్టారు. దీనికి కారణం ఆయ‌న కూడా హ‌సీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ ఎంపీ కావ‌డ‌మే. ప్రస్తుతం ఆయ‌న‌ ఖుల్నా డివిజన్‌లోని నరైల్-2 నియోజకవర్గానికి పార్లమెంటు సభ్యునిగా ఉన్నారు. మోర్తజా ఈ ఏడాది ప్రారంభంలోనే అవామీ లీగ్ పార్టీ నుంచి ఎంపీగా తిరిగి ఎన్నికయ్యారు.

ఇక మొర్తజా తన క్రికెట్ కెరీర్‌లో 117 అంతర్జాతీయ మ్యాచ్‌లలో బంగ్లాదేశ్‌కు సార‌థిగా ఉన్నాడు. బంగ్లా త‌ర‌ఫున 36 టెస్టులు, 220 వ‌న్డేలు, 54 టీ20లకు ప్రాతినిధ్యం వ‌హించాడు. ఈ మూడు ఫార్మాట్‌ల‌లో క‌లిపి మొత్తంగా 390 వికెట్లు, 2,955 పరుగులు సాధించాడు. 2018లో రాజ‌కీయాల‌లోకి అరంగేట్రం చేశాడు. అదే ఏడాది అవామీ లీగ్ పార్టీలో చేరి, ఎంపీగా గెలిచాడు.


More Telugu News