మాజీ సీఎం జగన్ భద్రతపై క్లారిటీ ఇచ్చిన ఏపీ పోలీసుశాఖ!

తనకు వ్యక్తిగత భద్రత తగ్గించారని, సీఎంగా ఉన్నప్పటి సెక్యూరిటీని ఇవ్వాలంటూ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ స్పందించింది. ప్రస్తుతం ఆయనకు జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ కొనసాగుతోందని, భద్రత తగ్గించారనే వాదనలో నిజం లేదని రాష్ట్ర పోలీసుశాఖ, ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మాజీ సీఎం హోదాలో జగన్‌‌కు నిబంధనల మేరకే భద్రతా సిబ్బందిని కేటాయించామని పోలీసుశాఖ స్పష్టం చేసింది.

చంద్రబాబు మాజీ సీఎంగా ఉన్నప్పుడు ఆయనకు అందించిన భద్రతనే ప్రస్తుతం జగన్‌కు కూడా కొనసాగిస్తున్నట్టు ఏపీ పోలీసుశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. జగన్‌ సీఎంగా ఉన్న సమయంలో ఆ హోదాను బట్టి అదనంగా కల్పించిన భద్రతను మాత్రమే తగ్గించామని, ప్రస్తుతం మాజీ సీఎం కావడంతో ముఖ్యమంత్రి స్థాయి భద్రత కల్పించడం సాధ్యంకాదని ఏపీ పోలీసు వర్గాలు అంటున్నాయి. కాగా జూన్‌ 3 నాటికి తనకున్న భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో మాజీ సీఎం జగన్ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

జగన్ భద్రతకు సంబంధించిన వివరాలను ఏపీ పోలీసు వర్గాలు పంచుకున్నాయి. ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారిని భద్రత ఇన్‌ఛార్జిగా పెట్టామని చెప్పారు.  ప్రస్తుతం జగన్‌కు 58 మంది సిబ్బందితో భద్రత కల్పిస్తున్నామని, ఆయన ఇంటి వద్ద 10 మంది సాయుధ గార్డులు ఉంటున్నారని, షిఫ్టుకు ఇద్దరు చొప్పున మొత్తం ఆరుగురు పీఎస్‌వోలు 24 గంటల పాటు భద్రత కల్పిస్తారని చెప్పారు. నిరంతరం అందుబాటులో ఉండేలా ఆరుగురు డ్రైవర్లను జగన్‌కు కేటాయించామని వివరించారు.


More Telugu News