అమరావతి ఆర్-5 జోన్ లబ్ధిదారులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

  • అమరావతిలో ఆర్-5 జోన్ తీసుకువచ్చిన గత ప్రభుత్వం
  • ఇతర ప్రాంతాల పేదలకు అమరావతిలో స్థలాల కేటాయింపు
  • నేడు జిల్లా కలెక్టర్లతో చంద్రబాబు సమావేశం
  • ఆర్-5 జోన్ లబ్ధిదారులకు వారి సొంత ప్రాంతాల్లో స్థలాలు కేటాయించాలని ఆదేశం
  • లబ్ధిదారులకు అమరావతిలో స్థలాలు కేటాయించలేమని స్పష్టీకరణ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలోని ఆర్-5 జోన్ వివాదానికి తెరదించే ప్రయత్నం చేశారు. ఇవాళ అమరావతిలో సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్లతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాజధానిలోని ఆర్-5 జోన్ అంశంపై ప్రత్యేకంగా చర్చించారు. ఆర్-5 జోన్ లబ్ధిదారులకు వాళ్ల ప్రాంతాల్లోనే ఇళ్లు కేటాయించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 

ఆర్-5 జోన్ లబ్ధిదారులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వారికోసం భూ సేకరణ చేపట్టాలని, అవసరమైతే టిడ్కో ఇళ్ల తరహాలో కట్టించి ఇవ్వాలని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి పేదలను తీసుకువచ్చి అమరావతిలో ఆర్-5 జోన్ ఏర్పాటు చేసి వారికి ఇళ్ల స్థలాలు కేటాయించడం తెలిసిందే. ఆ విధంగా తీసుకువచ్చిన పేదలకు వారి సొంత ప్రాంతాల్లోనే ఇళ్ల స్థలాలు కేటాయిస్తామే తప్ప, వారికి అమరావతిలో స్థలాలు కేటాయించలేమని చంద్రబాబు నేడు స్పష్టం చేశారు.


More Telugu News