యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా: రేవంత్ రెడ్డి ప్రకటన

  • రెండు రోజుల్లో ఆనంద్ మహీంద్రా బాధ్యతలు తీసుకోవచ్చునన్న సీఎం
  • అమెరికా పర్యటనలో ప్రకటించిన ముఖ్యమంత్రి
  • ఇటీవలే ముచ్చర్లలో స్కిల్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన సీఎం
యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చైర్మన్‌గా ఆనంద్ మహీంద్ర పేరును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. న్యూయార్క్‌లో ఎన్నారైల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... యువతలో నైపుణ్యతను పెంపొందించడం కోసం తమ ప్రభుత్వం కొత్త యూనివర్సిటీని తీసుకువచ్చిందన్నారు. ఇది పీపీపీ మోడల్‌లో ఉంటుందన్నారు. ఈ యూనివర్సిటీకి చైర్మన్‌గా ఉండాలని తాను ఆనంద్ మహేంద్రకు విజ్ఞప్తి చేశానన్నారు. ఆయన రెండు రోజుల్లో స్కిల్స్ యూనివర్సిటీ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందన్నారు. ఈ నెల 1న ముచ్చర్లలో స్కిల్స్ యూనివర్సిటీకి సీఎం శంకుస్థాపన చేశారు.

పెట్టుబడుల కోసమే ఇక్కడకు వచ్చా

పెట్టుబడుల సమీకరణ కోసమే ఈ రోజు న్యూయార్క్ పర్యటనకు వచ్చానన్నారు. హైదరాబాద్ నగరానికి ప్రపంచస్థాయి ఐటీ సంస్థలు వచ్చాయన్నారు. అధికారంలో టీడీపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, మరో పార్టీ ఉన్నా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రచించి ముందుకు సాగుతున్నామన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు, ఇంటర్నేషల్ ఎయిర్ పోర్ట్, హైటెక్ సిటీ నిర్మించామన్నారు. 159 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు వస్తేనే ఇంత అభివృద్ధి జరిగిందంటే... ఈరోజు 250 కిలో మీటర్లతో రీజినల్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నామన్నారు.

హైదరాబాద్ నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు మణిహారం అయితే, రీజినల్ రింగ్ రోడ్డు వడ్డాణం అవుతుందని వ్యాఖ్యానించారు. రీజినల్ రింగ్ రోడ్డు నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు రూరల్ రీజియన్‌గా మూడు లేయర్ల కింద అభివృద్ధి చేసేలా, మెగా మాస్టర్ ప్లాన్‌తో ముందుకు సాగుతున్నామన్నారు. ప్రపంచంలో చాలామంది వైద్యం కోసం మన దేశానికి, మన రాష్ట్రానికి వస్తున్నారన్నారు.


More Telugu News