మీకు కావాల్సింది ఇచ్చే బాధ్యత నాది... తెలంగాణకు రండి: ఎన్నారైలకు రేవంత్ రెడ్డి హామీ

  • అమెరికా, న్యూజెర్సీలో ప్రవాస భారతీయులతో రేవంత్ రెడ్డి సమావేశం
  • ఎన్నారైలు ధైర్యంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టవచ్చునని హామీ
  • తెలంగాణ ప్రభుత్వం ఇన్వెస్టర్ ఫ్రెండ్లీగా ఉందన్న ముఖ్యమంత్రి
ఎన్నారైలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని, మీకు ఏది కావాలన్నా ఏర్పాటు చేసే బాధ్యత తనదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అమెరికాలో తొలి రోజు పర్యటనలో భాగంగా న్యూజెర్సీలో ప్రవాస భారతీయులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పుట్టినగడ్డ రుణం తీర్చుకోవడానికి పెట్టుబడులతో రావాలని ప్రవాస తెలంగాణ, తెలుగు వారికి ఆయన పిలుపునిచ్చారు. ఎన్నారైలు ధైర్యంగా తెలంగాణకు వచ్చి పెట్టుబడులు పెట్టాలన్నారు.

ప్రజాప్రభుత్వం, ప్రజా పాలనపై విశ్వాసం ఉంచి రాష్ట్రానికి పెట్టుబడులతో రావాలని ఎన్నారైలను కోరారు. పెట్టిన ప్రతి రూపాయికి ప్రతిఫలం వచ్చేలా ప్రభుత్వ విధానాలు ఉంటాయని హామీ ఇచ్చారు. ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం ఉందన్నారు. అమెరికాకు మీరే ఆయువు పట్టు... ఇక తెలంగాణకూ రండి అని ఆహ్వానించారు.

ఈ మేరకు రేవంత్ రెడ్డి తన తొలి రోజు పర్యటనపై ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తాను న్యూజెర్సీలో ఎన్నారైలతో భేటీ అయినట్లు చెప్పారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణలో పెట్టుబడులకు అవకాశాలు, బ్యాగరికంచె వద్ద నిర్మించబోతున్న కొత్త నగర నిర్మాణం, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి, రాష్ట్రంలో అమలవుతోన్న సంక్షేమం తదితర అంశాలపై ఎన్నారైలతో ముచ్చటించినట్లు చెప్పారు. ప్రవాస భారతీయులకు పెట్టుబడులపై హామీ ఇచ్చినట్లు తెలిపారు.


More Telugu News