పారిస్ ఒలింపిక్స్ లో టెన్నిస్ గోల్డ్ మెడల్ విజేత జోకోవిచ్

  • పారిస్ ఒలింపిక్స్ టెన్నిస్ ఈవెంట్ లో మెన్స్ సింగిల్స్ విజేత జోకోవిచ్
  • ఫైనల్లో అల్కరాజ్ పై అద్భుత విజయం
  • 7-6, 7-6తో గెలిచిన సెర్బియా యోధుడు
సెర్బియా యోధుడు నోవాక్ జోకోవిచ్ పారిస్ ఒలింపిక్స్ టెన్నిస్ ఈవెంట్ లో పురుషుల సింగిల్స్ కేటగిరీలో స్వర్ణం చేజిక్కించుకున్నాడు. స్పెయిన్ యువ సంచలనం కార్లోస్ అల్కరాజ్ తో ఇవాళ జరిగిన ఫైనల్లో జోకోవిచ్ వరుస సెట్లలో విజయభేరి మోగించాడు. 

ఒలింపిక్స్ లో టెన్నిస్ మ్యాచ్ లు బెస్ట్ ఆఫ్ త్రీ పద్ధతిలో నిర్వహిస్తారు. ఎవరు రెండు సెట్లు గెలిస్తే వారే విన్నర్. ఇవాళ  హోరాహోరీగా జరిగిన గోల్డ్ మెడల్ మ్యాచ్ లో జోకోవిచ్ 7-6 (7-3), 7-6 (7-2)తో వరుస సెట్లలో అల్కరాజ్ ను ఓడించాడు. రెండు సెట్లు కూడా టైబ్రేకర్ వరకు వెళ్లాయంటే ఇరువురు ఆటగాళ్లు ఎలా పోరాడారో అర్థం చేసుకోవచ్చు. 

కెరీర్ లో అన్ని గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలిచిన జోకోవిచ్ కు ఒలింపిక్ విజేతగా నిలవాలన్నది ఎప్పటి నుంచో కలగా మిగిలిపోయింది. ఇన్నాళ్లకు, అది కూడా కెరీర్ చరమాంకంలో తన కల నెరవేర్చుకోవడం విశేషం. ఇక, జొకోవిచ్ విజయంతో పారిస్ ఒలింపిక్స్ లో సెర్బియా ఖాతాలో ఓ స్వర్ణం చేరింది. 

ఈ విజయంతో జోకోవిచ్ కెరీర్ 'గోల్డెన్ స్లామ్' సాధించాడు. గతంలో అన్ని గ్రాండ్ స్లామ్ టైటిళ్లతో పాటు ఒలింపిక్స్ స్వర్ణం కూడా సాధించి 'గోల్డెన్ స్లామ్' నమోదు చేసిన రాఫెల్ నాదల్, సెరెనా విలియమ్స్, ఆండ్రీ ఆగస్సీ, స్టెఫీ గ్రాఫ్ ల సరసన జోకోవిచ్ చేరాడు. 


More Telugu News