పారిస్ ఒలింపిక్స్‌లో నీ నుంచి పతకాన్ని దోచుకున్నారు!: బాక్సర్ నిశాంత్ ఓటమిపై నటుడు రణ్‌దీప్ హుడా

  • అద్భుత ప్రతిభ కనబరిచిన భారత బాక్సర్ నిశాంత్ దేవ్
  • మెక్సికో బాక్సర్‌ను విజేతగా ప్రకటించడంపై జడ్జిలపై విమర్శలు
  • అసలు స్కోరింగ్ విధానం బాగాలేదని మాజీ ఛాంపియన్ విజేందర్ సింగ్ ఆగ్రహం
పారిస్ ఒలింపిక్స్‌లో భారత బాక్సర్ నిశాంత్ దేవ్ అత్యుత్తమ ప్రదర్శన చేసినప్పటికీ నిరాశ ఎదురైంది. 71 కేజీల విభాగంలో క్వార్టర్ ఫైనల్‌లో మెక్సికో బాక్సర్ మార్కో వేర్డే చేతిలో 4-1 తేడాతో ఓడిపోయాడు. తొలి రౌండ్‌లో ఆధిక్యం ప్రదర్శించిన నిశాంత్ ఆ తర్వాత ప్రతి రౌండ్‌లోనూ మెరుగైన ప్రదర్శన చేశాడు.

కానీ తొలి రౌండ్ మినహా మిగతా రెండు రౌండ్లలో ప్రత్యర్థి గెలిచాడు. నిశాంత్ మంచి ప్రతిభ కనబరిచినప్పటికీ జడ్జిలు మాత్రం మెక్సికో బాక్సర్‌ను విజేతగా ప్రకటించడంపై విమర్శలు వచ్చాయి. నిశాంత్‌కు మద్దతుగా భారత మాజీ ఛాంపియన్ విజేందర్ సింగ్, బాలీవుడ్ నటుడు రణ్ దీప్ హుడా పోస్టులు పెట్టారు.

అసలు స్కోరింగ్ విధానం ఎలా చేశారో అర్థం కావడం లేదని విజేందర్ సింగ్ ట్వీట్ చేశాడు. ఇది గొప్ప ఫైట్ అని, నిశాంత్ చాలా అద్భుతంగా పోరాడారని ప్రశంసించాడు. నిశాంత్ బాధపడకు అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు. 

ఈ పోటీలో నిశాంత్ విజయం సాధించాడని, స్కోరింగ్ విధానం సరైనదేనా? అని రణ్ దీప్ హుడా ప్రశ్నించాడు. నీ నుంచి పతకాన్ని దోచుకున్నారు... కానీ నువ్వు మా మనసులను గెలిచావ్ నిశాంత్ అని ట్వీట్ చేశారు. ఇది చాలా బాధాకరమైన అంశమని, ఇలాంటివి చాలా జరిగాయని విమర్శించారు.


More Telugu News