మాజీ సీజేఐ ఎన్వీ రమణను కలిసిన మంద కృష్ణ మాదిగ

  • ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు ఓకే చెప్పిన సుప్రీంకోర్టు
  • మాదిగల్లో హర్షం
  • నాడు ఎస్సీ వర్గీకరణ కేసుకు సుప్రీంకోర్టులో విచారణకు అనుమతించిన ఎన్వీ రమణ
  • నేడు ఎన్వీ రమణను కలిసి కృతజ్ఞతలు తెలిపిన మంద కృష్ణ
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ నేడు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను కలిశారు. 

ఎన్వీ రమణ సీజేఐగా ఉన్న సమయంలో సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ వ్యవహారం విచారణకు వచ్చింది. పంజాబ్ ప్రభుత్వం దాఖలు చేసిన కేసును విచారణకు అనుమతించిన జస్టిస్ ఎన్వీ రమణ, ఆ కేసును ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి సిఫారసు చేశారు. ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణ అంశంపై పలు దఫాలు విచారణ జరిగింది. 

ఎన్వీ రమణ అప్పట్లోనే పదవీవిరమణ చేయగా... కొన్ని రోజుల కిందటే సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసుకోవచ్చంటూ చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో... ఎస్సీ వర్గీకరణ కేసును సుప్రీంకోర్టులో విచారణకు అనుమతించినందుకు నేడు మంద కృష్ణ జస్టిస్ ఎన్వీ రమణను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. సుప్రీంకోర్టులో తమకు న్యాయం జరిగిందని హర్షం వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ స్పందిస్తూ, ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమించిన మంద కృష్ణ మాదిగ బృందాన్ని అభినందించారు.


More Telugu News